Ugadi 2025: తెలుగు వారి తొలి పండగ ఉగాది.. చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి-ugadi 2025 check history importance and see what we should do on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2025: తెలుగు వారి తొలి పండగ ఉగాది.. చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి

Ugadi 2025: తెలుగు వారి తొలి పండగ ఉగాది.. చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి

Peddinti Sravya HT Telugu

Ugadi 2025: రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీన వచ్చింది. తెలుగు వారి తొలి పండగ ఉగాది చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి కూడా తెలుసుకోండి.

ugadi 2025 (pinterest)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీన వచ్చింది. ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది చరిత్ర గురించి, ఉగాది పండుగ విశిష్టత గురించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు వారి తొలి పండగ ఉగాది

తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది. అందుకనే తెలుగువారి తొలి పండగ అని పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, మామిడాకులు కట్టడం, కొత్త బట్టలు, ఉగాది పచ్చడి ఇలా పలు పద్దతులను పాటిస్తూ ఉంటాము.

ఎప్పటి నుంచో ఉన్న ఉగాది

ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది. ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు. కొన్ని శతాబ్దాలు ముందే మొదలైంది. ఉగాది పండుగ శాతవాహన రాజవంశం నాటితని తెలుస్తోంది. ఈ రాజవంశం 230 బీసీ నుంచి 220 ఏడీ దాకా ఉందట. ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీళ్ళు పరిపాలించారు. అప్పటి గ్రంథాలు శాసనాల్లో ఉగాది గురించి ఉంది.

ఉగాది నాడు ఏం చేయాలి?

  1. ఉగాది నాడు పంచాంగం దానం చేసి, దక్షిణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
  2. ఈరోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుంది.
  3. పూర్వకాలంలో ఉగాది రోజు విసినికర్రని కొనేవారు.
  4. ఈరోజు బట్టలు కొనడం, ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి.
  5. తైలాభ్యంగన స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈ రోజు ఇలా స్నానం చేయడం మంచిది.
  6. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిదట.
  7. ఇది ఎండాకాలం కనుక ఒక కుండని నీళ్లతో నింపి పురోహితుడికి దానం ఇస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.

ఉగాది నాడు చేయకూడనివి?

  1. ఉగాది నాడు ఎవరితో గొడవ పడడం, పెద్దవారిని అవమానించడం తిట్టడం వంటివి చేయకూడదు.
  2. మాసిపోయిన బట్టల్ని ఈరోజు వేసుకోకూడదు.
  3. ఈరోజు దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు.
  4. ఈరోజు పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
  5. మాంసాహారాన్ని తినడం కూడా మంచిది కాదు.
  6. ఈరోజు ఆలస్యంగా నిద్రపోకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం