Ugadi 2023 Meena Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మీనరాశి ఫలాలు
Ugadi 2023 Meena Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మీనరాశి ఫలాలు ఇక్కడ చదవొచ్చు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
Ugadi 2023 Meena Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మీనరాశి ఫలితాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

మీనరాశి వారి ఆదాయం - 8 వ్యయం - 11 రాజపూజ్యం - 1 అవమానం 2
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మీనరాశి వారికి రాశి ఫలాలు అనుకూలంగా లేవని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 2వ స్థానము నందు సంచరిస్తున్నాడు. శని వ్యయ స్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు ధనస్థానమగు 2వ స్థానము యందు సంచరిస్తున్నాడు. కేతువు 8వ స్థానము నందు సంచరిస్తున్నాడు.
ఈ గ్రహ స్థితి కారణంగా మీనరాశి వారికి ఈ సంవత్సరంలో చెడు ఫలితములు అధికముగా ఉన్నవి. మీనరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రవేశించినది. ఏలినాటి శని ప్రభావం వలన మీనరాశి వారికి ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు కనబడుచున్నవి. మీనరాశి వారు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. ఆర్ధిక విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. గురు, రాహువులు వాక్ స్థానమునందు సంచరించుట వలన ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ కేతువు ప్రభావం వలన ఆరోగ్య సంబంధ విషయాలయందు జాగ్రత్త వహించాలి.
మీన రాశి ఉద్యోగులకు రాశి ఫలాలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి ఉద్యోగస్తులకు కఠినమైన సమయం. ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిడులు, ఇబ్బందులు ఏర్పడును. మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంనందు సమస్యలు పెరుగును. వ్యాపారంలో నష్టములు మరియు ఆర్ధిక సమస్యలు ఏర్పడును. మీనరాశి విద్యార్థులకు మధ్యస్త ఫలితములు కలుగును. కష్టపడవలసినటువంటి సూచన.
మీనరాశి స్త్రీలకు ఆరోగ్య విషయముల యందు జాగ్రత్త వహించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబము నందు సమస్యలు ఏర్పడు సూచన. మీనరాశి రైతాంగానికి మధ్యస్త సమయము. సినీరంగం వారికి మధ్యస్త ఫలితముగా ఉన్నది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం చెడు ఫలితాలున్నాయని తెలియచేస్తున్నాను. మీనరాశి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించడం మరియు శనివారం శివాభిషేకం చేయడం ఉత్తమం.
మీన రాశి మాస వారి రాశి ఫలాలు
ఏప్రిల్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. జన్మరాశిలో రవి గురులు అహంభావాన్ని ఆకస్మికంగా ఎప్పుడైనా కోపాన్ని కల్గించవవచ్చును. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి.
మే: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. కీర్తి వలన ఆదాయం కలుగును. కుటుంబములో ఆనందము, ఆరోగ్యము అనుకూలించును. విలాసవంతమైన జీవితమును గడుపుతారు.
జూన్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా వేతనం పెరుగును. కుటుంబములో ఆనందము. ఆరోగ్యం అనుకూలించును. సంతానవృద్ధి.
జూలై: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మంచి సమయం. మీ కృషితో ముందుకు సాగుతారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి.
ఆగస్టు: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చేసే పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
సెప్టెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. బంధుమిత్రులతో గడుపుతారు.
అక్టోబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వృద్ధి. అధిక ధనాన్ని నిల్వ చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
నవంబర్: ఈ మాసం మీకు అనుకూలముగా లేదు. గ్రహస్థితి మిశ్రమం. అష్టమ రవి, కుజ సంచారం అనేక ఆవేశాలకు లోనవ్వచ్చు. వ్యాపార వాటాలలో పెట్టుబడులు, నూతన వ్యాపారాలు అనుకూలించవు.
డిసెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావం మీపై ఉంటుంది. భోగ భాగ్యాలు అనుభవిస్తారు. అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు.
జనవరి: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కష్ట సమయం. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం.
ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అధిక లాభాలు ఆర్జిస్తారు. అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది. విందు వినోదాలకు శుభకార్యాలకు వెళతారు. సమస్త ఐశ్వర్యాభివృద్ధి ప్రాప్తి.
మార్చి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో బుధ, రాహువులు బంధన యోగాన్నిచ్చే అవకాశం ఉంది. గృహమున శుభ యోగాలు కలసి వస్తాయి. భూగృహ స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.
- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
సంబంధిత కథనం