Ugadi 2023 Kumbha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు-ugadi 2023 kumbha rasi phalalu know telugu new year astrological predictions for sri shobhakrith nama samvatsaram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2023 Kumbha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు

Ugadi 2023 Kumbha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 03:06 AM IST

Ugadi 2023 Kumbha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

ఉగాది కుంభ రాశి ఫలాలు
ఉగాది కుంభ రాశి ఫలాలు

Ugadi 2023 Kumbha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

కుంభరాశి వారి ఆదాయం - 11 వ్యయం - 5, రాజపూజ్యం - 2 అవమానం - 6

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి వారికి ఫలితములు అనుకూలంగా లేవని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానము నందు సంచరిస్తున్నాడు. శని జన్మరాశి స్థానము నందు సంచరిస్తున్నాడు. రాహువు భ్రాతృ స్థానమగు 3వ స్థానము యందు సంచరిస్తున్నాడు. కేతువు 9వ స్థానమగు భాగ్యస్థానము నందు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ స్థితి కారణంగా కుంభరాశివారికి ఈ సంవత్సరంలో చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి.

జన్మ శని ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు మానసిక ఒత్తిళ్ళు అధికమగును. బృహస్పతి తృతీయము నందు సంచరించుట వలన పనుల యందు ఆటంకములు మరియు వేదన కలుగును.

కుంభరాశి వారికి తృతీయ స్థానమునందు రాహువు, భాగ్యము నందు కేతువు కొంత అనుకూల ఫలితాలు కలిగించెదరు. రాహువు కేతువు ప్రభావం వలన మీ యొక్క సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించెదరు. తృతీయము నందు గురు రాహువుల కలియక ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, ఆందోళనలు కలుగును. మొత్తం మీద కుంభరాశి వారికి చెడు ఫలితాలు కొంత అధికముగా గోచరిస్తున్నాయి.

కుంభ రాశి ఉద్యోగులకు రాశి ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు చికాకులు, సమస్యలు మరియు వేదనలు అధికమగును. ఉద్యోగములో రాజకీయ ఒత్తిళ్ళు కలుగును. కుంభరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఋణబాధలు పెరుగును. ధనము సమయానికి చేతికి అందదు. మరియు ఒత్తిళ్ళు ఏర్పడును.

కుంభరాశి విద్యార్థులకు మధ్యస్త సమయము. విద్యార్థులు కష్టపడి చదవాలని సూచన. కుంభరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు వేధించును. కుంభరాశి రైతాంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. సినీరంగం వారికి అనుకూలంగా లేదు.

కుంభరాశి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించడం మరియు శనివారం శివాభిషేకం చేయడం వలన మరింత శుభఫలితాలు పొందగలరు.

కుంభ రాశి మాసవారి ఫలితములు

ఏప్రిల్ :- ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. ఆదాయం పెరుగును. మానసిక ప్రశాంతత. కుటుంబ సభ్యులతో గడపడానికి అనువైన సమయం. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం.

మే : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంతానం వలన సంతోషం. ధైర్యంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు.

జూన్ :- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. తరచుగా అనారోగ్య సమస్యలు వచ్చును. శుభకార్యం. అప్పు చేయవలసి వస్తుంది.

జూలై : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. చదువులకు ఇతరదేశాల్లో అవకాశం. దూరప్రయాణాలు కలసివస్తాయి.

ఆగస్టు: - ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భార్యభర్తల మధ్య గొడవలకు తావు లేకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. వైద్యులను సంప్రదించాలి.

సెప్టెంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. బంధువుల, పూర్వపు మిత్రుల కలయిక. శుభవార్తలు వింటారు.

అక్టోబర్ :- ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. కీర్తి ప్రతిష్టలు కలుగును. మానసిక ఒత్తిడి.

నవంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైన ఆదాయం. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది.

డిసెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం నుండి లాభాలు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం. ఇంట్లో శు భకార్యాలు అదృష్టం కలిసివస్తాయి. మనశ్శాంతి. ఆరోగ్యం అనుకూలించును.

జనవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరదేశాలలో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అన్నింటా విజయం సాధిస్తారు. అనుకూలమైన సమయం.

ఫిబ్రవరి : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. భూమి లేక గృహం స్థిరాస్తులను పొందుతారు. వ్యవహార జయం. మీరు సాధించే ప్రతి పనిలోను మీ స్నేహితుల ప్రమేయం ఉంటుంది.

మార్చి:- ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. ధనాన్ని అధికముగా ఖర్చుచేస్తారు. ఆయురారోగ్యాలు వృద్ధి. కుటుంబము సంతోషముగా ఉంటుంది.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం