Tula Rasi 2024: తులా రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. మీ ఆవేశమే అనర్థాలకు దారితీస్తుంది
Tula Rasi 2024: తులా రాశి వారికి 2024వ సంవత్సరం రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయని పంచాంగకర్త, జ్యోతిషశాస్త్ర నిపుణుడు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. తులా రాశి సంవత్సర ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
2024వ సంవత్సరం తులారాశి వారికి శని పంచమ స్థానములో అనుకూలంగా వ్యవహరించడం, ఆరో స్థానములో కేతువు అనుకూలత ఉన్నప్పటికి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కళత్రములో, మే నుండి డిసెంబర్ వరకు గురుడు అష్టమంలో సంచరించుట వలన ఈ సంవత్సరం తులా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. 2024లో ప్రథమార్థం తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలించును. ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఆరోగ్యము, కుటుంబ విషయాలపరంగా కొంత ఇబ్బందులు కలుగునని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఉద్యోగస్తులకు 2024 మధ్యస్థ ఫలితాలు కలిగిస్తుంది. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, పనిఒత్తిళ్ళు కొంత ఇబ్బంది కలిగించును. తులారాశి వ్యాపారస్తులకు 2024 కొంత కష్ట్టమయముతో కూడియున్నటువంటి సమయం. రైతాంగం, సినీరంగాల వారికి 2024 సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగాను, ద్వితీయార్థం ఇబ్బందికరముగాను గోచరిస్తుంది.
స్త్రీలు ఈ సంవత్సరం అరోగ్య విషయాలపై కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సమస్యలు కొంత వేధించును. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉన్నది. మొత్తం మీద తులారాశివారికి 2024లో మొదటి 5 నెలలు కొంత అనుకూలంగానూ, ఆఖరి ఏడు నెలలు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నట్టు గోచరిస్తోందని చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు.
2024 తులారాశి ప్రేమ జీవితం
2024 సంవత్సరంలో తులా రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కొంత ఇబ్బందులకు గురిచేయును. అష్టమ గురుని ప్రభావం వలన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వాళ్ళతో విభేదాలు, భేదాభిప్రాయములు కలుగును. ఎదుటివారు చెప్పేటటువంటి విషయాలను వినడానికి ప్రయత్నించాలని సూచన. వ్యయస్థానములో రాహువు ప్రభావంచేత అవేశపూరిత నిర్ణయాల వలన ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు కలుగును.
2024 తులారాశి ఆర్థిక విషయాలు
2024 సంవత్సరం తులా రాశివారికి ఆర్థికపరంగా ఇబ్బందులు అధికముగా ఉన్నాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుబలం ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలత కలుగును. మే నుండి డిసెంబర్ వరకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరించుచున్నవి. ఆరోగ్య విషయాలలో కుటుంబ అవసరాల కోసం ధనమును అధికముగా ఖర్చు చేసేటటువంటి స్థితి ఏర్పడును.
2024 తులారాశి కెరీర్
2024 సంవత్సరం తులారాశి వారికి కెరీర్ పరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు అధికముగా ఉండును. పని ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు వేధించును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురవును. కుటుంబ సమస్యలు కెరీర్ పరంగా కొంత ఇబ్బందులకు గురిచేయును. కెరీర్ విషయాల్లో తులారాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడు సూచన.
2024 తులారాశి ఆరోగ్యం
2024 సంవత్సరం తులారాశివారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా లేదు. అష్టమ గురుని ప్రభావం వలన చికాకులు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో 2024 సంవత్సరంలో తులారాశి వారు కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులకు కూడా అరోగ్య సమస్యలు కలగడం మిమ్మల్ని కలచివేస్తుంది. 2024 సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యపరంగా కొంత అనుకూల ఫలితాలుండును. మే నుండి సంవత్సరం అంత్యం వరకు అష్టమ గురుని ప్రభావం వలన అరోగ్య విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి.
2024 తులారాశి పరిహారాలు
తులా రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతిరోజు లేదా కనీసం గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురువారం రోజు శనగలను దానం ఇవ్వడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.