Naraka chaturdashi: రేపే నరక చతుర్దశి- శుభ సమయం, పాటించాల్సిన ఆచారాలు, దీని వెనుక కథలు ఇవే
Naraka chaturdashi: అక్టోబర్ 30న నరక చతుర్దశి జరుపుకోనున్నారు. ఈరోజునే చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈరోజు శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన ఆచారాలు, నరక చతుర్దశి వెనుక ఉన్న కథల గురించి తెలుసుకుందాం.
ధన త్రయోదశితో దీపావళి పండుగ సంబరాలు ప్రారంభంఅవుతాయి. రెండో రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దీన్నే చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ నరకాసురిడిని వధించింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరక చతుర్దశి జరుపుకుంటారు.
ఈరోజు ఇంటిని శుద్ధి చేసుకుని దీపాలు వెలిగిస్తారు. దుష్ట శక్తులను దూరం చేయమని, అకాల మృత్యు భయం లేకుండా చేయమని కోరుకుంటూ యముడికి దీపం వెలిగిస్తారు. దీన్ని యమ దీపం అని పిలుస్తారు. అలాగే పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ నరక చతుర్దశి రోజు వారి కోసం దీపం వెలిగిస్తారు. అక్టోబర్ 30న చోటీ దీపావళి జరుపుకోనున్నారు. శుభ ముహూర్తం, పూజా విధి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
సమయం
నరక చతుర్ధశి తేదీ: అక్టోబర్ 30, 31 రెండు తేదీల్లో తిథి ఉంది.
చతుర్దశి తిథి ప్రారంభం: అక్టోబర్ 30 మధ్యాహ్నం 1.15 గంటల నుంచి
చతుర్దశి తిథి ముగింపు: అక్టోబర్ 31 మధ్యాహ్నం 3.52 గంటల వరకు ఉంటుంది. అందుకే చోటీ దీపావళి, దీపావళి రెండూ ఒకే రోజు వచ్చాయి. దీని వల్ల దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనే దాని మీద గందరగోళం నెలకొంది.
ప్రాముఖ్యత
దుష్ట శక్తుల నుంచి ప్రతికూల శక్తుల నుంచి తమను రక్షించమని కోరుకుంటూ ఈరోజు చాలా మంది కాళీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల దుష్ట ఆత్మలు, హానికరమైన ప్రభావాలను దూరం చేస్తుందని విశ్వాసం. ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ జీవితాల్లో నుంచి ప్రతికూలతలు దూరం చేయమని దేవతను వేడుకుంటారు. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడిని పూజిస్తారు. మరికొందరు హనుమంతుడిని ఆరాధిస్తారు. నరక చతుర్దశి రోజు సాయంత్రం యమ దీపం వెలిగించే సంప్రదాయం పాటిస్తారు.
ఆచారాలు
నరక చతుర్దశి రోజు నూనె, మూలికలు, పువ్వులతో తయారు చేసిన ఉబ్తాన్ అనే ప్రత్యేకమైన పదార్థంతో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇలా స్నానం ఆచరించడం వల్ల నరకానికి వెళ్ళకుండా ఉంటారని భక్తుల విశ్వాసం. దీపావళి మాదిరిగానే ఇంటిని దీపాలతో అలంకరించుకుంటారు. ప్రదోష కాలంలో దీప దానం చేయడం చాలా విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ఇలా దీప దానం చేయడం వల్ల నరకంలో ఉన్న పూర్వీకులకు విముక్తి కలుగుతుందని అంటారు.
నరక చతుర్దశి కథలు
నరక చతుర్దశి జరుపుకోవడం వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణుడికి సంబంధించినది అయితే మరొకటి బలి చక్రవర్తి వామనుడికి సంబంధించింది. నరకాసురుడు తనకున్న వరం గర్వంతో దేవతలు, సామాన్య ప్రజలను తీవ్రంగా హింసించసాగాడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ నరకాసురిడిని వధించింది. తమకు పట్టిన పీడ విరగడ అయినందుకు సంతోషంగా ప్రజలందరూ నరక చతుర్దశి రోజు దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు.
రెండో కథ వామనుడు, బలి చక్రవర్తికి సంబంధించింది. దాన ధర్మాలు చేయడంలో బలి చక్రవర్తి ముందుంటాడు. విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల భూమి కావాలని కోరాడు. అందుకు సరేనని బలి ఒప్పుకుంటాడు. అయితే వామనుడు ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని తీసుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ వేయాలని అంటే బలి తన తల మీద పెట్టమని చెప్పాడు. వామనుడు అడుగు పెట్టడంతో బలి చక్రవర్తి పాతాళంలోకి వెళ్ళాడు. బలి మంచి మనసుకు సంతోషించిన విష్ణుమూర్తి వరం ఏదైనా కోరుకోమని అడిగాడు. చతుర్దశి రోజు ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళు పూర్వీకులతో పాటు నరకానికి వెళ్ళకుండా ఉండే విధంగా వరం ఇవ్వమని అడుగుతాడు.