ప్రతీ ఏటా హనుమాన్ జయంతిని చైత్రంలో ఒకసారి, వైశాఖంలో ఒకసారి జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమిని స్వామి విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని జన్మదినంగా పేర్కొంటోంది పరాశర సంహిత అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మారుతికి సిందూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకమూ ఉంది. సూటిగా చెప్పాలంటే, ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది.
అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సిందూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లినప్పుడు, సిందూరధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట.
అప్పుడు సీతాదేవి... శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్షు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరం ధరించినందుకే దీర్ఘాయుష్షు వస్తే, తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్యా ఉండదని భావించాడట హనుమంతుడు.
అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తన ఒళ్లంతా సిందూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి, "నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు" అని వరమిచ్చాడని చెబుతారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000