ఆగస్ట్ 9, నేటి రాశి ఫలాలు.. నాగపంచమి ఈ రాశులకు అదృష్టాన్ని ఇచ్చింది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ09.08.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 09-08-2024
వారం: శుక్రవారం, తిథి : పంచమి,
నక్షత్రం: హస్త, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యా విషయాలకు ప్రభుత్వ సహాయం లభిస్తుంది. ఉద్యోగ వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మనశ్శాంతి కోసం ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించండి. ఆవేశానికి లోనుకావద్దు. సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి.
వృషభం
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యలను కొని తెచ్చుకొంటారు. కంటి సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అమ్మవారిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని, చికాకును అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక అడ్డంకులు ఎదురవుతాయి. సమస్యలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సరదాగా ఉండేందుకు సమయం కేటాయించండి. లక్ష్మిదేవిని ఆరాధించండి. సత్ఫలితాలు పొందవచ్చు.
కర్కాటకం
ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు. పై అధికారుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. సహనంతో వాటిని ఎదుర్కోండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఆత్మీయులతో సరదాగా గడుపుతారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి. అన్నింటా జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవిని ఆరాధించండి.
సింహం
అన్నిరకాల వృత్తుల వారికి అధికాదాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. భూమి గృహ స్థిరాస్తులను కూడబెట్టే అవకాశముంటుంది. అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోండి. అమ్మవారి దర్శనం శుభప్రదం.
కన్య
సంపద, కీర్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇది సామాజిక జీవితానికి సంబంధించిన ప్రకాశవంతమైన కాలం. సమాజంలో మెరుగైన స్థానం మరియు స్థితిని పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కాలంలో మీ స్నేహితులూ మీకు సహకరిస్తారు. వివాహితులు కూడా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. హనుమంతుడి దర్శనం శుభదాయకం.
తుల
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. విద్య, వృత్తిపరంగా ముందంజ వేస్తారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి మంచి జరుగుతుంది.
వృశ్చికం
వాహనం, సంపద మరియు విలాసవంతమైన జీవితం వంటి సాధారణ సౌకర్యాలతో మీ జీవనశైలి సంపన్నంగా ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆదాయం అందుతుంది. ఉద్యోగంలో సత్ఫలితాలు పొందుతారు. అన్నింటా మంచే జరుగుతుంది. శివాలయాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేయండి.
ధనుస్సు
ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైన జీవనం సాగిస్తారు. ధనానికి లోటుండదు. అప్పుడప్పుడు మానసిక ఇబ్బందులు పడుతుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అన్నింటా విజయాలు అందుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
మకరం
ఉత్తమ ఫలితాలు అందుతాయి. మానసిక శారీరక ఒత్తిడికి లోనవుతారు. స్త్రీలతో సంభాషణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నోటిని అదుపులో ఉంచడం మంచిది. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి.
కుంభం
చదువుల్లో ప్రతిభా పాటవాలతో రాణిస్తారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. కీలక విషయాల్లో కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. లలితా సహస్ర నామాన్ని జపించండి.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు గృహమును విడిచి ఇతర చోట్ల నివసించవలసి వస్తుంది. చర్మవ్యాధులకు గురవుతారు. స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు వాయిదా వేయటం మంచిది. త్వరలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అమ్మవారిని ధ్యానించండి.