శని పేరు చెప్తేనే అందరూ భయపడిపోతారు. ధర్మదేవత శని, మనం చేసే పాప పుణ్యాలను లెక్కించి, దాని ద్వారా ఫలితాలను ఇస్తాడు. శని దోష నివారణకు త్రయోదశి ఎంతో ప్రభావితమైనది. ఈరోజు శని త్రయోదశి కనుక, ఈరోజు ఏం చేయాలి, త్రయోదశి తిథి విశిష్టత, ప్రాముఖ్యతతో పాటు చరిత్రయోదశి పరిహారాలు కూడా తెలుసుకోండి.
శని త్రయోదశి నాడు శని దేవుడికి పూజ చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు శని త్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తే, ఆర్థిక సమస్యల నుండి బయటపడచ్చు, ఆరోగ్యం కూడా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
క్షీరసాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకుని లోకాల్ని కాపాడాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతో దేవతలందరూ కూడా ఆయన దగ్గరకు త్రయోదశి తిధి నాడు వెళ్లారు. అందుకనే త్రయోదశి తిథికి ఎంతో విశిష్టత ఉందని శివపురాణం చెబుతోంది.
శని త్రయోదశి వ్రతం అందరూ చేయొచ్చు. కానీ ముఖ్యంగా మీన రాశి వారికి, మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన, ఈ రాశి వారు కచ్చితంగా పూజించేటట్టు చూసుకోవాలి. కుంభ రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంది. కనుక, ఈ రాశి వారు కూడా శనికి ప్రత్యేక పూజలు చేయడం మంచిది. దీనివల్ల శని శుభ ఫలితాలను ఇస్తాడు. సింహ రాశి వారికి అర్థాష్టమ శని ఉంది కనుక పరిహారాలను పాటిస్తే మంచిది.
శని త్రయోదశి నాడు నల్లటి దుస్తులను దానం చేయడం వలన మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది, జీవితంలో సంతోషంగా ఉంటుంది.
లేని వారికి, పేదవారికి ఆహారాన్ని దానం చేయడం కూడా మంచిది. ఇలా చేయడం వలన సంపద పెరుగుతుంది, కష్టాల నుంచి బయటపడవచ్చు, సంతోషంగా ఉండొచ్చు.
శని త్రయోదశి నాడు కాకులకి ఆహారం పెడితే కూడా జీవితంలో సంతోషం ఉంటుంది. శని వాహనమైనటువంటి కాకికి ఆహారం ఇస్తే, శని ప్రభావం నుంచి బయటపడవచ్చు, శుభ ఫలితాలను పొందవచ్చు.
పిల్లలు కావాలనుకునేవారు ఉపవాసం ఉంటే మంచిది. ఈరోజు దంపతులు ఉపవాసం ఉన్నట్లయితే, సంతాన భాగ్యం కలుగుతుంది. శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.