మార్చి 6, నేటి రాశి ఫలాలు.. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు, ఉద్యోగస్థులకు ఒత్తిళ్లు-today dina phalalu march 6th 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Dina Phalalu March 6th, 2024 Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 6, నేటి రాశి ఫలాలు.. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు, ఉద్యోగస్థులకు ఒత్తిళ్లు

HT Telugu Desk HT Telugu
Mar 06, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ06.03.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 6, నేటి రాశి ఫలాలు
మార్చి 6, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.03.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: బుధవారం, తిథి : ఏకాదశి,

నక్షత్రం : పూర్వాషాఢ, మాసం: మాఘము,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. చంద్రుడు అనుకూల సంచారం వలన అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. జన్మగురుని ప్రభావం చేత పనులయందు ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. నరఘోషలు వంటివి ఏర్పడు సూచన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి లాభస్థానములో బుధ, గురు, శనుల ప్రభావం వలన పనులయందు లాభము, జయము కలుగును. దశమస్థానములో కుజ, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఇది కలసి వచ్చే రోజు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. జన్మగురుని ప్రభావం వలన కొంత ఒత్తిళ్ళు ఏర్పడు సూచన. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. లాభస్థానములో రాహువు ప్రభావం వలన పనులయందు పట్టు ఏర్పడును. దశమంలో రవి, బుధ, శని అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యయ స్థానములో గురుని ప్రభావం ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలపరంగా అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి. లాభములో గురుడు, దశమంలో రాహువు ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈరోజు కలిసివచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత భయాందోళనలు కలుగు సూచన. వ్యాపారస్తులకు అనుకూల సమయం. శ్రీమన్నారాణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆయుస్థానమైనటువంటి అష్టమ స్థానములో రవి, బుధ, శనుల ప్రభావం వలన ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టు సూచన. భాగ్యములో రాహువు, దశమంలో గురుని ప్రభావం వలన ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కళత్ర స్థానములో కుజుడు, అష్టమ శని ప్రభావం చేత కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రామాలయాలను దర్శించండి. రామకోటి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

నేటి దిన ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాక్‌ స్థానములో కేతువు అష్టమ రాహువు ప్రభావం వలన గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు భాగ్యములో గురుని అనుకూల ప్రభావం వలన మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి. శత్రు స్థానములో శుక్ర, కుజుల అనుకూలత వలన శత్రువర్గంపై విజయాన్ని పొందెదరు. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. మానసికంగా ప్రశాంతంగా ఉండెదరు. పంచమంలో కుజ శుక్రుల అనుకూలత వలన వీరు చేసే ప్రయత్నాలు ఫలించును. ఆరో స్థానములో రవి, బుధ, శని అనుకూల ప్రభావం చేత ధనలాభము, కీర్తి కలుగును. జన్మరాహువు, కళత్ర కేతువు ప్రభావంచేత పనులయందు ప్రయాణముల యందు ఒత్తిళ్ళు ఏర్పడును. అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. గత కొంత కాలంతో పోల్చుకుంటే ఈ రాశికి మార్పు తెచ్చేటటువంటి రోజు, శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చతుర్ధంలో కుజ, శుక్రుల అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందెదరు. పంచమంలో రవి, బుధ, శని ప్రభావం వలన నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయాలను పొందెదరు. ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. కళత్రంలో గురుని అనుకూలత, ఆరో స్థానంలో రాహువు అనుకూలత వలన ఉద్యోగస్తులకు సత్ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు శుభఫలితాలు ఏర్పడును. విష్ణుమూర్తికి సంబంధించిన అలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అర్థాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి పంచమంలో రాహువు, లాభములో కేతువు అనుకూల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి లభించును. మాతృస్థానములో కుజ, శుక్రుల ప్రభావం చేత బంధు మిత్రులతో సోదరీమణులతో ఆనందముగా గడిపెదరు. చతుర్ధంలో రవి, బుధ, శని ప్రభావంచేత శారరీక శమ కలుగును. ప్రయాణాల కోసం ప్రణాళికలు రచించెదరు. ఉద్యోగస్తులకు పనుల యందు ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనస్థానములో కుజ, శుక్రుల ప్రభావం చేత ధన లాభం, సౌఖ్యం కలుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మాతృ వర్గీయులతో స్నేహము అధికమగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదరు. పంచమ స్థానములో గురుని అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు కలుగును. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. వినాయకుని పూజించడం, సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజ, శుక్రుల ప్రభావంచేత ఈవారం ఆరోగ్య సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక సమస్యలు, మానసిక వేదన అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించడం మంచిది. వాక్‌ స్థానములో రవి, బుధ, శని ప్రభావం వలన వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్థులకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రిచుకోవాలని సూచన. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు ఒత్తిళ్ళతో కూడియున్నటువంటి వారం. జన్మరాశిలో ఏలినాటి శని, జన్మశని ప్రభావంచేత అలాగే కుంభరాశికి జన్మరాశిలో రవి, బుధుల ప్రభావంచేత పనులయందు ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. పనులయందు ఆలస్యము, బద్దకం వంటివి ఏర్పడును. ఆరోగ్య విషయూలయందు శ్రద్ధ వహించాలి. వాక్‌ స్థానములో రాహువు, తృతీయ స్థానములో గురుని ప్రభావం వలన అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును. వ్యయస్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన ఖర్చులు అధికమగును. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు కష్టకాలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాహువు ప్రభావం వలన అరోగ్య సమస్యలు, పనుల యందు ఒత్తిళ్ళు కలుగు సూచన. బృహస్పతి అనుకూల ప్రభావం చేత ధనలాభం కలుగును. లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం , శారీరర సౌఖ్యం, ఆనందం పొందెదరు. వ్యయస్థానములో రవి, బుధ, శని ప్రభావంచేత ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధ పెరుగు సూచన. ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు అని సూచన. నూతన వ్యాపారం, స్పెక్యులేషన్‌, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పరించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ