నల్లవాడ గ్రామం ఉదయగిరికి సమీపంలో దుత్తలూరు మండలంలో నల్లవాడ వద్ద ఉన్న వెంగమాంబ ఆలయం వుంది. మహా మహిమలకు కొలువై లక్షలాది భక్తులకు అభిష్ట సిద్ధిని కలిగిస్తోంది. 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణదేశాన్ని పాలించే రోజుల్లో వెంగమాంబ, పచ్చవ మగమనాయుడు-సాయమ్మ పుణ్య దంపతులకు రేణుకాదేవి (పార్వతి) అనుగ్రహంతోనితిపై పుణ్య సువాసనలు గుబాళించి తాను త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ గౌరీ, శ్రీ దాక్షాయణి, శ్రీ సతీదేవి, శ్రీ దుర్గాదేవి అంశలతో అన్పించిన మహాదేవతగా తన మహిమలను భక్తులకు చూపించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అందరూ సమానమే, కులాల హెచ్చుతగ్గులు ఎంత మాత్రమూ తగవని ఆ తల్లి అందరికీ తెలియజెప్పింది. ఆనాటి కులాల్లో ఉన్న అసమానతలు, అమ్మృశ్యాది దోషాలను ఆమె పరిష్కరించేది. ప్రజలు నీటికరువుతో అల్లాడుకుంటే, పరిసర గ్రామాలలో వర్షాలు వెనుకబడి కరువుకాటకాలతో బాధలు పడుతుంటే, మొదటిసారిగా తన ఇలవేల్పయిన రేణుకామాతను ప్రార్ధించింది. వెంటనే దండిగా వర్షాలు కురిపించి అందరికీ హర్షాన్ని కలిగించిన సంఘటన ద్వారా వెంగమాంబ మహిమ లోకానికి తెలిసిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చిన్నతనంలో తల్లి చెప్పినదాన్ని విని, సతీ అనసూయ, సతీ సావిత్రి ముఖ్యంగా పతిని అవమానించిన రక్షుడి ఎదుట యోగాగ్నిలో భస్మమైన సతీదేవి వృత్తాంతం వింటూ, వెంగమాంబ తన వరిలో సనాతన హైందవధర్మ మహిమను నిలుపుకుంది. ఆ ధర్మాచరణతో దేవతగా మారి లోకాన్ని కాపాడాలనే నిశ్చయ జ్ఞానం వెంగమాంబలో ఉండేది.
వెంగమాంబను తమ ఊరిలో వున్న వేమూరు గురవయ్య నాయుడుకు తల్లిదండ్రులు వివాహం చేసారు. అత్తింటికి వెళ్లిన వెంగమాంబ మంచికోడలిగా పేరు తెచ్చుకుంది. గృహస్థధర్మం గొప్పతనాన్ని తన మనసంతా నింపుకుని, భర్తకు ప్రేమానురాగాలను పంచి, అనుకూలవతియైన భార్యగా నిలిచింది. నూతన దంపతుల అన్యోన్యత, ఒకరికోసం ఒకరు జీవించగలిగే తీరు ఆ కాలంలో అందరి ప్రశంసలు పొందిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జగన్మోహన సౌందర్యంతో సాక్షాత్ దేవతా రూపంలో పుట్టి, గొప్ప మానవతా ధర్మాన్ని ఆచరిస్తోంది అని అందరూ భావించేవారు. వెంగమాంబ ఉండే పరిసర ప్రాంత ప్రజలందరూ ఆమెకు సేవలు చేసి ప్రేమాభిమానాలను చూపించినందుకు కృతజ్ఞతగా ఒక చక్కని పసుపు చీరను కానుకగా ఇచ్చారు. ఆ చీరను వెంగమాంబ తన పూజా గదిలో ఉంచి వారిని గౌరవించింది. అగ్నిదేవునిలో తాను ప్రవేశించునప్పుడు ఆ చీరనే కట్టుకున్నదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒకరోజు భర్తతో, స్నేహితులతో కలసి తమ గ్రామానికి దగ్గరలో ఉన్న దొడ్డాకొండ సమీపంలో పశుగ్రాసం కోసం సంచరిస్తుండగా, బందిపోటు దొంగలు వారిని చుట్టుముట్టారు. గురవయ్య నాయుడు దొంగలతో యుద్ధం చేసి వారిని తరిమిచేశాడు. దొంగల నాయకుడు విసిరిన విషపు బల్లెం గుండెకు తగలగా, గురవయ్య వీరుడుగా పోరాడి, తన చేతిలోని గొడ్డలిని విసిరి పారిపోతున్న దొంగల నాయకుడిని సంహరించాడు.
వెంగమాంబ తన కన్నుల ముందే నేలకొరిగిన భర్తను ప్రాణాలతో ఉంచడానికి ప్రయత్నాలు చేసింది. ఇంటికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించినా, ప్రాణాలు కాపాడలేకపోయారు అని వైద్యులు చెప్పారు. తనకు ఎంతో సహకరించిన స్నేహితులకు, ప్రజలకు, లోకానికి తాను దేవతగా మారి మేలు చేయాలని, పతివ్రతాధర్మంలో ముత్తైదువుగా భర్తకంటే ముందే మరణిస్తే తన పతివ్రత్య మహిమచే అందరిని రక్షించగలనని వెంగమాంబ భావించిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆమె సాహస నిర్ణయాన్ని ఎంతో మంది విరమించమని చెప్పినా, దృఢ నిర్ణయంతో అందరిని ఒప్పించింది. తన పుట్టింటివారైన పచ్చనవారు దుఃఖాన్ని దిగమింగుకొని చితి రగిలించగా, "నేను దేవతగా మారి మీ అందరి కష్టాలు తొలగిస్తాను" అని చెప్పింది. తనను వదలలేక దుఃఖిస్తున్న పెదవెంగమ్మ స్నేహాన్ని మెచ్చి, "మీ దంపతులు మా సన్నిధిలో పూజలందుకుంటారు" అని చెప్పింది. అంధమైన బావ ముసలయ్య గారు కూడా "నా సన్నిధిలో పూజలందుకుంటారు" అని తెలిపింది.
చితిలో తాను కాలిపోతున్నప్పటికీ, తన మాంగల్యం ఏమీ కాలిపోకుండా వుంటుందని చెప్పి, వాటిని సేకరించమని చెప్పి చితిలో సమర్పించుకుని శ్రీవెంగమాంబ పేరంటాలుగా ప్రత్యక్షమైంది. వెంగమాంబ తల్లి తన భర్త ప్రాణాలతో ఉన్నప్పటికీ, అతనికంటే ముందే చితిలో ప్రవేశించింది. కొద్దిసేపటికి భర్త గురవయ్య వీరుడు కూడా ప్రాణాలు విడిచాడని, వారిద్దరినీ ఆ చితిలో దహనం చేసి, తరువాత వారు దేవతలుగా మారి ఆలయంలో పూజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాస పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారంతో ప్రారంభమై, నాలుగవ రోజు బుధవారం పుణ్య దంపతుల కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. అమ్మవారి మాట ప్రకారం స్నేహితురాలు పెదవెంగమ్మ దంపతులు, బావగారైన అంధుడు ముసలయ్య కూడా పూజలందుకుంటున్నారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000