దీపావళి పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే మార్కెట్లో సందడి మొదలవుతుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
దీపావళి అనగానే ఇల్లు మొత్తం అందంగా దీపాలతో అలంకరించుకోవడం, సాయంత్రం అయితే బాణాసంచా కాల్చుకోవడం ఇదే అనుకుంటారు. కానీ చాలా మంది దీపావళిని వినూత్నంగా జరుపుకుంటారు. వివిధ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ దీపావళి వేడుకలను ప్రత్యేకంగా చేసుకుంటారు. ఏయే ప్రాంతాల్లో దీపావళిని విభిన్నంగా జరుపుకుంటారో తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ లో దీపావళి వేడుక కాళీ పూజతో సమానంగా భావిస్తారు. దుష్ట శక్తులను నాశనం చేసే మాతగా కాళీ దేవిని ఆరాధిస్తారు. దుర్గాదేవి భయంకరమైన అవతారం ఇది. దీపావళి రోజు బెంగాల్ వాసులు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కాళీ మాతను పూజిస్తారు.
14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలు జరుపుకుంటారు. వారి రాకను ఆహ్వానిస్తూ దీపాలు వెలిగించి ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దీపావళి పండుగ రోజు తప్పకుండా ఇక్కడ రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తారు. దీన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు.
తమిళనాడు రాష్ట్రంలో నూతన వధూవరులు తలై దీపావళి జరుపుకుంటారు. వివాహం తర్వాత పుట్టింట్లో జరిగే మొదటి దీపావళి వేడుకలు ఇవి. చాలా ఆనందంగా ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటారు. పెళ్ళయిన తర్వాత తొలిసారిగా కూతురు పండుగకు వచ్చిన సందర్భంగా అల్లుడు, కూతురికి ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తారు.
మహారాష్ట్ర వాసులు గోవర్థన్ పూజ చేసుకుంటారు. జీవానాధారంగా భావించే పశువులను, అవులను పూజిస్తారు. పండుగ సందర్భంగా మహారాష్ట్రీయులు ఫరల్ అనే పిలిచే ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తారు. ఇందులో చక్లి, లడ్డూ వంటి రుచికరమైన స్వీట్లు పెడతారు. అందరూ సంతోషంగా వాటిని ఆరగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
గుజరాత్ వ్యాపారులకు ఇది కొత్త సంవత్సరం మాదిరిగా ఉంటుంది. తమ ఖాతా పుస్తకాలను పూజలో ఉంచుతారు. దీపావళి సందర్భంగా చేసే లక్ష్మీ పూజను చోప్డా పూజ అంటారు. శారదా పూజను దీపావళి మూడో రోజు నిర్వహిస్తారు. ఇది వారికి హిందూ సంవత్సరం చివరి రోజును సూచిస్తుంది.
శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ నరకాసురిడిని వధిస్తుంది. తమకు పట్టిన రాక్షస పీడ వదిలినందుకు గుర్తుగా ప్రజలు దీపావళి వేడుకలు చేసుకుంటారు. గోవాలో నరకాసుర వధ నిర్వహిస్తారు. దీన్ని చోటీ దీపావళిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో నరకాసురిడి దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేస్తారు.
దీపావళి రోజు ఒడిశా ప్రజలు కౌన్రియా కతిని జరుపుకుంటారు. ఇది వారి పూర్వీకులను గౌరవిస్తూ చేసుకునే వేడుక. ఈరోజు పూర్వీకులు భూమి మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు ఇస్తారని నమ్ముతారు. వారిని పిలిచేందుకు జనపనార కాడలను కాలుస్తారు. దీన్నే బాదబడువా డాకా అని పిలుస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.