24 ఏకాదశులలో అత్యంత పవిత్రం, శ్రేష్ఠమైనది ముక్కోటి ఏకాదశి-చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
24 ఏకాదశులలో అత్యంత పవిత్రం, శ్రేష్ఠమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటాం. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ఏకాదశి నుంచి మకర సంక్రమణం దాకా వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయనేది పురాణ వాక్యం.
ప్రతి సంవత్సరం వచ్చే 24 ఏకాదశులలో అత్యంత పవిత్రం, శ్రేష్ఠమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటాం. ఈ పవిత్ర పర్వదినాన భక్తకోటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకోవడానికి పరితపిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ఏకాదశి నుంచి మకర సంక్రమణం దాకా వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయనేది పురాణ వాక్యం.
శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
యత్కళ్యాణ గుణాభిరామ మమలం మంత్రాణి సంశిక్షతే యత్సం శేతిపతి ప్రతిష్ఠితమిదం విశ్వం వదత్యాగమః యో యోగేంద్ర మనః సరోరుహతమః ప్రధ్వంసవిద్యాభనుమాన్ ఆర్తత్రాణ పరాయణః సభగన్నారయణోమే గతిః'పుష్యమి' నక్షత్రంతో కూడిన పున్నమి గల మాసం పుష్యమాసం. ఈ మాసానికే 'సహస్యం' అనే నామాంతరం ఉంది. పుష్యమీ నక్షత్రం శని దేవుని నక్షత్రం. కనుక శని ప్రీత్యర్థం ఈ మాసమంతా పూజలు చేయాలి. ఈ మాసం చాలా పునీతమైన మాసం. విష్ణువు, శని, సూర్యుడు, శివుడు,పితృదేవతలు ఈ మాసంలో భక్తుల చేత పూజింపబడతారు.
ఈ మాసంలో సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి మొదలైన పండుగలు వస్తాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.కుంఠము కానిది. వైకుంఠము. 'కుంఠనము' అంటే కలిసి ఉండే స్థితిని చెడగొట్టడం అని అర్థం. వియోగం కలిగించడం. 'వికుంఠ' అంటే వియోగాన్ని తొలగించడం. కలిసి ఉండవలసిన వారిని, సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకి 'వైకుంఠ' శబ్దము సార్థకమైంది. వైకుంఠుడు అంటే 'సర్వేషాం సంశ్లేషితా' అని వ్యుత్పత్తి.
శాంతిపర్వంలో "యయా సంశ్లేషితా భూమిః అద్భిః వోయః చ వాయునా వాయుశ్చ తేజసా సార్థం వైకుంఠత్తం అంతతోమయాః" అని స్వామి స్వయంగా చెప్పాడు. "పంచ భూతాల పంచీకరణాదులు చేసేది నేనే" అందుకే నన్ను వైకుంఠుడు అంటారు" అన్నాడు ఆయన. చాతుర్మాస్య కాలంలో దక్షిణ దిక్కున తలబెట్టి నిద్రించి మేల్కొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇస్తాడు.
అందువలన వైకుంఠ ఏకాదశి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించే రోజు. ఈనాడు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నవారు అనంతమైన పుణ్యరాశిని దక్కించుకుంటారు. కనుక ఈ దర్శనాన్ని 'మోక్షోత్సవం' అంటారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధనుస్సు నెల పట్టిన తర్వాత వచ్చే ఏకాదశి అనగా సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే ధనుర్మాసంలో శుక్ల ఏకాదశిని 'ముక్కోటి ఏకాదశి' అని చెప్తున్నాయి మన పురాణాలు. ముక్కోటి- మూడు+కోటి. దేవతలు మూడు కోట్లని కొందరు భావిస్తారు. కానీ వేదాలు, శ్రుతులు "త్రయః త్రింశత్ వై దేవాః" ముప్పది ముగ్గురు దేవతలున్నారని స్పష్టంగా చెప్పాయి.
ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వినీ దేవతలు వీరు మూడు+కోటి ముక్కోటి అయ్యింది. "యే దేవాసో దివ్యై ఏకాదశః పృధివ్యా మధ్యే ఏకాదశస్థ అప్పుక్షత్ మహి ఏకాదశస్థ తే దేవాసోయజ్ఞ మిమంజుషద్వం" అనే మంత్రాన్ననుసరించి దివి, భువి, జలం అనే మూడు స్థాయిల్లో పదకొండు మంది చొప్పున వ్యాపించియుంటారు. ఇందరు దేవతలు ఒక్కటిగా ఏకాదశి నాడు స్వామిని సేవించ వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
'ఏకాదశి' ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం ఈ పదకొండు యందు భగవంతుని లగ్నం చేసి, సేవించిన వారికి తప్పక ముక్తి లభిస్తుంది. ఈ సత్యాన్ని తెలియజేసేందుకే ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత కలిగింది. ఈ రోజున నిరాహారులై శ్రీహరిని స్తుతించి, సేవించి, పూజించి, జాగారం చేసి ముక్తిని పొందమని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి.
“తిథేశ్చ శ్రియమాప్నోతి" అని శాస్త్ర వచనం అనగా కాలాంగాల్లో ప్రధానమైన తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుందని అర్థం. తిథులన్నింటిలోనూ ప్రత్యేకత కలిగిన తిథి ఏకాదశి. ఈ తిథి త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని 'హరివాసరము' అని కూడా వ్యవహరిస్తుంటారు. మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి. నెలకు రెండు చొప్పున పన్నెండు నెలలకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి.
అధిక మాసం వచ్చిన సంవత్సరంలో ఈ ఏకాదశులు ఇరవై ఆరు వస్తాయి. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనందున 'విష్ణువాసరం' అని కూడా పిలుస్తారు. సంసార సాగరంలో చిక్కుకొని అనేకానేక కష్టనష్టాలు అనుభవించే మానవులను ఉద్దరించేందుకు సాక్షాత్ శ్రీమహావిష్ణువే ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఏకాదశి తిథి రోజున వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించేవారు సర్వవ్యాధుల నుంచి విముక్తిని పొందుతారని, వారికి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలిగి తీరుతుందని పద్మపురాణం పేర్కొంటుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.