Sitaram bank: భక్తి భావాన్ని పెంచే బ్యాంక్ ఇది.. ఇక్కడ డబ్బు కాదు “సీతారాం” పదాలు డిపాజిట్ చేయాలి
Sitaram bank: బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. కానీ ఈ బ్యాంక్ లో మాత్రం సీతారాం అనే పదాలు డిపాజిట్ గా చేయాలి. భక్తి భావాన్ని పెంచే ఈ బ్యాంక్ గురించి మీకు తెలుసా?
Sitaram bank: సాధారణంగా బ్యాంక్ అంటే డబ్బులు దాచుకోవడానికి, రుణాలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ బ్యాంకు మాత్రం ఎటువంటి డబ్బులు ఇవ్వదు. డబ్బులు డిపాజిట్ చేసుకోదు. కేవలం భక్తి మార్గాన్ని పెంపొందించేందుకు మాత్రమే ఈ బ్యాంకు ఏర్పాటు చేశారు. అది ఎక్కడో కాదు రాముడు జన్మస్థలం పవిత్రమైన అయోధ్య నగరంలో ఉంది.
ప్రపంచంలోనే ఇతర బ్యాంకుల మాదిరిగా ఒక ప్రత్యేకమైన సంస్థగా ఏర్పడింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ప్రత్యేకమైన బ్యాంకుని స్థాపించారు. 1970లో స్థాపించిన ఈ బ్యాంక్ పేరు ఇంటర్నేషనల్ శ్రీ సీతారాం బ్యాంక్. సాంప్రదాయేతర బ్యాంకింగ్ పద్ధతులను అవలంబిస్తూ భక్తులను, పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.
ఎక్కడికి డిపాజిట్ గా డబ్బులు కాదు “సీతారాం” అనే పదాన్ని రాసి జమ చేయాలి. ఇది కేవలం భారత్ లోనే కాదు వివిధ దేశాల్లో కూడా ఈ బ్యాంకు శాఖలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ సీతారాం బ్యాంక్ లో ఖాతా తెరవడానికి మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం సీతారాం అనే పదాలను రాసి ఆ పుస్తకాన్ని బ్యాంకులో జమ చేయాలి.
అప్పుడే పాస్ బుక్ ఇస్తారు
ఇంటర్నేషనల్ శ్రీ సీతారాం బ్యాంకులో ఖాతా తెరవడాన్ని ఒక ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. ఖాతా తెరవడానికి అర్హత పొందాలంటే ముందు కనీసం ఐదు లక్షల సార్లు సీతారాం అని రాయాలి. ఈ పని పూర్తయిన తర్వాత పాస్ బుక్ జారీ చేస్తారు. మరి రిటర్న్ గా ఏం వస్తుందని అనుమానం వచ్చే ఉంటుంది. మామూలుగా అయితే బ్యాంకులు డిపాజిట్లు చేస్తే దాని మీద వడ్డి అందజేస్తారు. ఇక్కడ కూడా మీకు రాబడి ఉంటుంది. అయితే అది పుణ్యఫలం. శ్రీ రాముని పట్ల మీకున్న భక్తికి ప్రతిఫలంగా ఆశీర్వాదాలు, మనశ్శాంతి, ఆధ్యాత్మిక చింతన పొందుతారు.
భాషా భేదాలు లేవు
అంతర్జాతీయ శ్రీ సీతారాం బ్యాంకులో భక్తికి భాష అవరోధాలు ఏమి ఉండవు. సీతారాం అనే పవిత్ర పదాలు హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, గుజరాతీ, మరాఠీ సహా అనేక భాషలలో బుక్లెట్లను భక్తులకు అందిస్తారు. భక్తులు రాముడు పట్ల తమకున్న భక్తిని ఈ విధంగా చాటుకుంటారు. ఈ బ్యాంకు శాఖలు భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో కూడా ఉన్నాయి. విదేశాల నుంచి కూడా భక్తులు సీతారాం బుక్ లెట్లు రాసి ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఈ ఆధ్యాత్మిక సాధనలో చురుకుగా పాల్గొంటారు. దేశ, విదేశాలలో మొత్తం కలిపి 150 శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకులో 20వేల కోట్ల బుక్ లెట్లు సేకరించారు.
సీతారాం రాసేందుకు బుక్స్ ఉచితం
ఈ బ్యాంకు భక్తులకు వారి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని సులభతరం చేయడానికి ఉచితంగా పుస్తకాలను కూడా అందిస్తుంది. ప్రతి ఖాతాని నిశితంగా పరిశీలిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి తపాలా ద్వారా కూడా కాపీలను పంపుతుంది, స్వీకరిస్తుంది. భక్తులు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనే దానితో సంబంధం లేకుండా ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారు. వ్యవస్థాపకులు మహంత్ నృత్య గోపాల్ దాస్, బ్రాంచ్ మేనేజర్ పునీత రాందాస్ మహారాజ్ బ్యాంకు కార్యకలాపాలను చూసుకుంటారు. ప్రారంభించినప్పటి నుంచి 54 సంవత్సరాలకు పైగా ఈ బ్యాంకు సేవల ద్వారా భక్తులు తమకి రాముడు పట్ల భక్తిని నిరూపించుకుంటున్నారు. అధ్యాత్మికంగా బలపడుతున్నారు.