Diwali gifts: దీపావళి గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే వీటిని మాత్రం ఇవ్వొద్దు-these things never gift to others on diwali festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali Gifts: దీపావళి గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే వీటిని మాత్రం ఇవ్వొద్దు

Diwali gifts: దీపావళి గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే వీటిని మాత్రం ఇవ్వొద్దు

Gunti Soundarya HT Telugu
Oct 18, 2024 04:20 PM IST

Diwali gifts: దీపావళి రోజు స్నేహితులు, సన్నిహితులను కలుసుకున్నప్పుడు వారికి మర్యాదపూర్వకంగా గిఫ్ట్స్ తీసుకుని వెళతారు. మీరు మీ ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇలాంటి వస్తువులు మాత్రం ఇవ్వకండి. అది ప్రతికూల శక్తులను ఇస్తుంది.

దీపావళికి ఈ గిఫ్ట్స్ ఇవ్వొద్దు
దీపావళికి ఈ గిఫ్ట్స్ ఇవ్వొద్దు (pinterest)

అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక దీపావళి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక చోటకు చేరి స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుమతులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు.

గిఫ్ట్స్ ఇవ్వడం అనేది సంప్రదాయంలో ఒక భాగమైపోయింది. పండుగకు తగినట్టుగా బహుమతులు ఎంచుకోవడం ముఖ్యం. దీపావళి పండుగ రాబోతుంది. ఈ సందర్భంగా మీరు మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు బహుమతులు ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇవి మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి.

గడియారాలు

ఎక్కువ మంది ఇచ్చే బహుమతుల్లో గడియారం ఒకటి. కానీ విశ్వాసాల ప్రకారం దీపావళి సమయంలో గడియారం బహుమతిగా ఇవ్వడం అశుభరకరమైనదిగా భావిస్తారు. ప్రతికూల శక్తులను పంపుతుంది. అది పని చేసేటప్పుడు వచ్చే టిక్ టిక్ సౌండ్ కాలంతో పాటు జీవితం ఎలా తగ్గిపోతుంది అనే దానికి సూచికగా చాలా మంది చూస్తారు. అందుకే దీన్ని ఇవ్వకూడదు.

నలుపు, తెలుపు వస్త్రాలు

అందరూ కొత్త దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. మీరు వేరే వాళ్ళ ఇంటికి సందర్శించడానికి వెళ్లేటప్పుడు వారి కోసం పొరపాటున కూడ నలుపు, తెలుపు రంగు వస్త్రాలు తీసుకోవద్దు. నల్లటి బట్టలు బహుమతిగా ఇవ్వడం లేదా ధరించడం అనేది దుఃఖంతో ముడిపడి ఉంటుంది. అందుకే వేడుకల సమయంలో ఈ రంగు దుస్తులు ధరించరు. ఇక తెలుపు రంగు శోకాన్ని సూచిస్తుంది.

పదునైన వస్తువులు

కత్తులు, కత్తెరలు వంటి ఇతర పదునైన వస్తువులు కూడా ఇవ్వకూడదు. ఇవి సంబంధాలను తెంచడాన్ని సూచిస్తాయి. కలిసిమెలిసి ఆనందంగా వేడుకలు చేసుకునేటప్పుడు వీటిని దూరంగా ఉంచాలి. కుటుంబం, స్నేహితుల మధ్య ఐక్యత, ఆనందం, సానుకూల బంధాలను ప్రోత్సహించే బహుమతులు ఎంచుకోవాలి. అందుకే మీరు వీటిని కొనకూడదు.

హ్యాండ్ బ్యాగ్స్

ఆడవారికి ఇష్టమైన వాటిలో హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి. వీటిని కూడా ఎక్కువగా గిఫ్ట్ గా ఇస్తారు. కానీ దీపావళికి వీటిని ఇవ్వకూడదు. తోలు ఉత్పత్తులు జంతు వనరుల నుంచి తీసుకుంటారు. దీపావళి అనేది సంతోషంగా జరుపుకునే వేడుక. అందుకే ఇటువంటి ఆనందకరమైన రోజు జీవులకు హాని కలిగించే వస్తువులు తీసుకోకూడదు. వాలెట్స్, షూస్, బ్యాగ్స్ వంటివి తీసుకోకూడదు.

రీసైక్లింగ్ వస్తువులు వద్దు

మీకు గతంలో ఎవరైనా ఇచ్చిన బహుమతులు మళ్ళీ రీక్రియేట్ చేసి ఇవ్వడం. వాటిని ఇతరులకు గిఫ్ట్ గా పంపించడం వంటివి చేయకూడదు. మీకు వచ్చిన బహుమతి ఇతరులకు ఇవ్వడంలో అర్థం లేదు. మీరు బహుమతితో పాటు దానికి సంబంధించిన శక్తిని కూడా అందిస్తున్నట్టు అర్థం.

మద్యం

దీపావళి పార్టీ అంటే పురుషులు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇవి కూడా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. దీపావళి పండుగ స్వచ్చత, ఆధ్యాత్మికతను నొక్కి చెబుతుంది. అందుకే వీటిని గిఫ్ట్ గా ఇవ్వకండి. వీటికి బదులుగా జ్యూస్, ప్రత్యేకంగా తయారు చేసిన పండుగ పానీయాలు ఇవ్వవచ్చు.

దేవతా విగ్రహాలు

దీపావళి పూజలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలకు ఉంచుతారు. వీటిని కూడా మీరు ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. దేవతా విగ్రహాలు ఇవ్వాలనే ఆలోచన సానుకూలమైనది అయినప్పటికీ అది మంచిది కాదు. అందుకే పండుగ సమయంలో విగ్రహాలను కానుకగా ఇవ్వకుండా ఉండటం మంచిది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner