Planets for happy life: ప్రతి వ్యక్తి జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవించాలని కోరుకుంటాడు. కెరీర్ లో విజయం, వ్యక్తిగత ఆనందం పొందాలని అనుకుంటాడు. కలలను వాస్తవంగా మార్చుకునేందుకు కృషి చేస్తాడు. అయితే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ వారు కోరుకున్న విజయాన్ని చేరుకోవడంలో కొన్నిసార్లు విఫలమవుతారు. అలా జరగడంలో జాతకంలో అననుకూలమైన గ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి.
గ్రహాల స్థానాలు సరిగా లేకపోతే ఒక వ్యక్తి పేదవాడిగా మారతాడు. అదే సరైన స్థానంలో ఉంటే రాజుగా మారతాడు. ఏ ఏ గ్రహాలు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే విజయం, పురోగతి, ఆనందం లభిస్తాయో తెలుసుకుందాం.
బృహస్పతిని దేవతల గురువుగా కొలుస్తారు. కెరీర్ లో పురోగతికి బృహస్పతి ముఖమైన పాత్ర పోషిస్తాడు. బృహస్పతి ధనుస్సు, మీన రాశులను పాలిస్తాడు. జ్ఞానం, సంతానం, విద్య, మతపరమైన కార్యకలాపాలు, సంపద, వృద్ధికి బృహస్పతి కారకుడిగా ఉంటాడు. కెరీర్లో పురోగతి కోసం జాతకంలో బృహస్పతి బలంగా ఉండడం చాలా అవసరం. అందుకే బృహస్పతిని అదృష్టం, జ్ఞానం ఇచ్చే గ్రహంగా పిలుస్తారు. జాతకంలో గురు స్థానం బలంగా ఉంటే ఉద్యోగం, వృత్తి రెండింటిలోను గణనీయమైన పురోగతి లభిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి 10వ ఇంట్లో ఉంటే అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది.
సూర్య భగవానుడు శక్తి ప్రదాత. ప్రపంచం మొత్తానికి జీవనాధారం. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు ఉపాధి, సామాజిక గౌరవంలో ఉన్నత స్థానాలను సూచిస్తాడు. ఒక వ్యక్తి నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాడు. సింహ రాశిని పాలిస్తాడు. మేష రాశిలో ఉన్నతంగా ఉంటాడు. తులా రాశిలో బలహీనంగా ఉంటాడు. కెరీర్లో పురోగతి, విజయాన్ని ఆశించే వారికి జాతకంలో సూర్యుడి బలమైన స్థానం చాలా అవసరం. పనిలో విజయం సాధించాలని అనుకున్నవాళ్లు తప్పనిసరిగా సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ సూర్యుడికి నీటిని సమర్పించాలి.
శని సూర్యుడు కుమారుడు, న్యాయ దేవతగా జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. దుఃఖం, వ్యాధులు, కష్టాలు, సంతోషం ఇస్తాడు. మకర, కుంభ రాశులకు అధిపతి. శనితో పాటు ఒక వ్యక్తి ఆనందాన్ని ప్రభావితం చేయడంలో ఇతర గ్రహాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ధైర్యం బలాన్ని ఇచ్చే కుజుడు… నీడ గ్రహాలైన రాహుకేతువులు కూడా ఒక వ్యక్తి సంతోషం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ నాలుగు గ్రహాలు కలిసి ఒకే ఇంట్లో ఉంటే వారి జీవితంలో విభేదాలు ఎదురవుతాయి. స్నేహం, ప్రేమ, వైవాహిక సంబంధాలలో నిరంతర ఘర్షణలకు దారితీస్తుంది. జీవితంలో ఆనందాన్ని కొనసాగించేందుకు ఈ గ్రహాలకు కోపం రాకుండా చూసుకోవాలి. వాటిని ఎప్పడూ శాంతింప చేయడం చాలా ముఖ్యం. అప్పుడే జీవితం శాంతి, ఆనందంతో నిండిపోతుంది.
గ్రహాలు మాత్రమే కాకుండా నక్షత్రాల కూడా మానవ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. జాతకంలో నక్షత్రం బలహీనమైన లేదా అశుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో నిరాశ, చికాకు ఎక్కువగా ఉంటుంది. అదే అనుకూలంగా ఉంటే శ్రేయస్సు, ఆనందం కలిగిస్తాయి. సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.