ఏకాదశి రోజు చేయకూడని తప్పులు తెలుసా? పురాణాలు, శాస్త్రాల్లో ఏకాదశి ఉపవాసానికి సంబంధించి అనేక వివరణలు, సూచనలు ఉన్నాయి. మనం చేసే పాపాలన్నీ ఏకాదశి రోజున మనం తినే ఆహారాన్ని ఆశ్రయిస్తాయని శాస్త్ర వాక్కు. అందుకే ఉపవాసం చేయాలని శాస్త్ర సూచన అని ఆధ్యాత్మిక వేత్త నండూరి శ్రీనివాస్ ప్రవచించారు.
‘దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు కలిపి ఏకాదశి వ్రతం చేయాలి. దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. నేల మీద పడుకోవాలి. ఏకాదశి తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉదయాన్నే స్నానమాచరించి పూజామందిరంలో సంకల్ప శ్లోకం చదువుకోవాలి..’ అని నండూరి వివరించారు.
ఏకాదశ్యాం నిరాహారో
భూత్వాహం అపరే హని
భోక్ష్యామి పుండరీకాక్ష
శరణం మే భవాచ్యుత
అనే శ్లోకం చెప్పుకోవాలి. అప్పుడు ఏకాదశి ఉపవాసం మొదలుపెట్టాలి. ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాసం చేయాలి. ద్వాదశి రోజున స్నానమాచరించి ఉపవాస దీక్ష విరమించాలి. ద్వాదశి పారణ శ్లోకం చదువుకోవాలి.
అజ్ఞాన తిమిరాంధస్య
ప్రతేనానేన కేశవ
ప్రసీద సుముఖీనాధ
జ్ఞాన దృష్టి వ్రతోభవ
ఏకాదశి ఉపవాసం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని ఉల్లంఘించరాదు. ఎల్లవేళలా దీనిని ఆచరించాలి. ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. చెడు మాట్లాడకూడదు. చెడు వినకూడదు. చెడు చూడకూడదు. దూషణలు, వాదనలు కూడదు. దశమి రాత్రి నుంచే బ్రహ్మచర్యం పాటించాలని ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్ వివరించారు.