కార్తీక ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత.. ఈ రెండు రోజులూ ఏం చేయాలి?-the significance of kartika dwadashi and pournami what to do on these special days ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  The Significance Of Kartika Dwadashi And Pournami What To Do On These Special Days

కార్తీక ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత.. ఈ రెండు రోజులూ ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu
Nov 23, 2023 07:00 AM IST

కార్తీక మాసంలో ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత, ఈ రెండు రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి వివరాలను ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత తెలుసుకోండి
కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత తెలుసుకోండి (pixabay)

దీపావళి తరువాత రోజునుంచీ మొదలయ్యే కార్తీక మాసం సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల. చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తీకమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని అంటున్నాయి శాస్త్రాలు. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.

అలాగే కార్తీక శుక్షపక్ష విదియ నాడు భగినీ హస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇవ్వడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. చవితినాడు నాగులచవితిగా పరిగణించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తారు. ఇవేకాకుండా మరికొన్ని పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకతల్ని సంతరించకున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మాలధారణ చేపట్టే మాసం

ఈ కార్తీకంలోనే అయ్యప్పదీక్షను స్వీకరించడం వెనుక కారణం లేకపోలేదు. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఓ నమ్మకం. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి భక్తులు చేరుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కార్తీక ద్వాదశి ప్రాధాన్యం

కార్తీకంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు. ఈరోజునే అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించారని పురాణాలు చెబుతున్నాయి. యోగులూ, మునులూ తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కూడా ఇదే.

ఆ రోజునే విష్ణుమూర్తి తులసిలకు కళ్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశినాడు లక్ష్మీదేవిని పరిణయమాడతాడని విష్ణుపురాణం పేర్కొంటుంది. అందుకే ద్వాదశి నాడు సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడిగా భావించి కళ్యాణం జరిపించి దీపాలతో అలంకరిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కార్తీక పౌర్ణమిరోజు ఏం చేస్తారంటే..

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా చెబుతారు. ఈ రోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడి వధ కూడా జరిగిందట. శంకరుని గురించి నారదుని ద్వారా విన్న త్రిపురాసురుడు కైలాసంపైకి దండెత్తి వెళ్ళాడట. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం శంకరుడు త్రిపురాసురుడిని సంహరించడంతో దేవతలంతా స్వామిని పూజించారని అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారని పురాణ గాధ.

కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాలను వెలిగించాలనీ, ఇవి రోజుకో వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయనీ చెబుతారు. ఈ పౌర్ణమినాడు కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకుంటారు.

ఈరోజు శివాలయాల్లో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల్నీ పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. అరుణాచలంలో ఈరోజున వెలిగించే దీపాల్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

ఈ నెల మొత్తం శివాభిషేకాలు, రుద్రపఠనం, లలిత విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలూ కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.