Naga panchami temple: నాగపంచమి రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది.. ఇక్కడ శివుడి ప్రతిమ విశేషమైనది-the doors of nagchandreshwar temple opened the temple opens for only one day on naga panchami ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Naga Panchami Temple: నాగపంచమి రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది.. ఇక్కడ శివుడి ప్రతిమ విశేషమైనది

Naga panchami temple: నాగపంచమి రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది.. ఇక్కడ శివుడి ప్రతిమ విశేషమైనది

Gunti Soundarya HT Telugu
Aug 09, 2024 10:37 AM IST

Naga panchami temple: నేడు దేశవ్యాప్తంగా నాగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయ సముదాయంలోని నాగచంద్రేశ్వర్ ఆలయంలో నాగ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది ఏంటో చూసేయండి.

నాగపంచమి రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం
నాగపంచమి రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం

Naga panchami temple: ఈరోజు దేశవ్యాప్తంగా నాగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు అలయాలను దర్శించుకుని పుట్టలో పాలు పోస్తూ పూజలు చేస్తున్నారు. నాగ పంచమి రోజును పురస్కరించుకుని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం సముదాయంలోని నాగచంద్రేశ్వర్ ఆలయం తెరుచుకుంది. 

ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. అది కూడా శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజు మాత్రమే. అందుకే ఈ ఏడాది నాగ పంచమికి ముందు ఆగస్ట్ 8వ తేదీ అర్థరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నాగదేవతను దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలబడి పూజలు చేశారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల పాముకాటు భయం ఉండదని, జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున వాసుకి, మణిభద్ర, కాళిక, ధనంజయ, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన వారిని పూజించే సంప్రదాయం ఉంది.

దేశంలోనే ప్రత్యేకమైన ఈ ఆలయ తలుపులు నాగ పంచమి రోజున సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి సంవత్సరం నాగ పంచమికి ఒక రోజు ముందు అర్ధరాత్రి నుండి ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు క్యూలు కడతారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాకాళేశ్వర ఆలయంలో నాగపంచమి రోజున నాగచంద్రేశ్వరుని దర్శనం చాలా ప్రత్యేకమైనది. 

జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళ్ ఆలయ సముదాయంలో చాలా పురాతనమైన నాగచంద్రేశ్వరుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో పాముపై కూర్చున్న శివ-పార్వతి విగ్రహం చాలా అరుదైనది. ఆలయంలోని నాగచంద్రేశ్వరుని విగ్రహాన్ని దర్శించి పూజించడం ద్వారా శివపార్వతులిద్దరూ సంతోషిస్తారని, పాముల భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

శేషనాగుపై శివపార్వతులు 

సాధారణంగా విష్ణుమూర్తి శేషనాగుపై శయనిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం శివపార్వతులు శేషనాగు మీద శయనిస్తారు. వీరితో పాటు వినాయకుడు కూడా ఉంటాడు. ఈ విగ్రహం చాలా పురాతమైనది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. నాగులకు రాజుగా భావించే తక్షకుడు ఈ ఆలయంలో నివసిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. నాగపంచమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి కాలసర్ప దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. ఆగస్ట్ 9 అర్థరాత్రి మళ్ళీ గుడి తలుపులు మూసేస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం మాత్రమే ఉండటం వల్ల భక్తులు లక్షల్లో వస్తారు. 

ఈసారి కూడా గురు, శుక్రవారాల్లో రాత్రి పూట పూర్తి పూజలతో ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులందరూ పాల్గొన్నారు. తలుపులు తెరిచిన అనంతరం నాగచంద్రేశ్వరునికి విధివిధానాల ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు ప్రజలు ఈ ఆలయంలో రోజంతా నాగచంద్రేశ్వరుని దర్శనం చేసుకుంటారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.