కాశీ క్షేత్రం కన్నా నూరు రెట్లు గొప్పదైన ధర్మపురి క్షేత్ర వైభవం, అక్కడి నది గొప్పతనం ఏంటో తెలుసుకుందాం
కాశీ క్షేత్రం కన్నా నూరు రెట్లు గొప్పదైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర వైభవం, అక్కడి వింతలు, విశేషాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన ధర్మపురి క్షేత్రం ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక శాంతి, పరమాత్ముడి అనుగ్రహాన్ని అందించే పవిత్ర స్థలం. భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించటంతో తమ జీవితాల్లో ధర్మానికి సంబంధించిన గాథలను తెలుసుకుని మోక్షాన్ని పొందాలని ఆశిస్తూ ఈ ప్రదేశాన్ని పునరావృతంగా సందర్శిస్తారని ప్రముఖ ఆధ్యాత్మిక వెత చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
ధర్మపురి ప్రముఖ నరసింహ క్షేత్రం. “ధర్మపురి” అంటేనే ధర్మానికి పునాది. గోదావరి తీరాన వెలసిన ఈ క్షేత్రం వైష్ణవుల ఆరాధనకు సజీవ సాక్ష్యం. పవిత్ర గోదావరి దక్షిణ దిశగా ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశి' అన్న పేరొచ్చింది. బ్రహ్మాండ పురాణంలో పురాతనమైన రామలింగేశ్వర ధర్మపుర ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. తెలంగాణలో జగిత్యాల పట్టణానికి సమీపంలోని హరిహర క్షేత్రమిది. పవిత్రమైన బ్రహ్మ పుష్కరిణి కూడా జతకావడంతో త్రిమూర్తి క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ క్షేత్రానికి సంబంధించి పురాణ గాథ ఎంతో ఆసక్తికరమైనది. నరసింహస్వామి అవతారం హిరణ్యకశిపుడిని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించిన తర్వాత, తన ఆగ్రహాన్ని శాంతపరిచేందుకు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ గోదావరి తీరంలో ఆయన తపస్సు చేశారని, ఆ తరువాత ఈ ప్రాంతం ధర్మపురి అని పిలువబడినట్లు పురాణాలు చెబుతున్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇక విశేషంగా, ధర్మపురి నరసింహ స్వామిని సన్యాసి నరసింహుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ ఆయన్ని యోగ స్థితిలో దర్శించే అవకాశం లభిస్తుంది. ఈ ఆలయం ప్రాచీన కాలం నుంచి వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక చింతనకు కేంద్రంగా నిలిచింది.
యమధర్మరాజు కోరిక మేరకు పృథు మహారాజు పాపాలన్నీ పటాపంచలు కాగల వెసులుబాటు ఇక్కడ కలిగించాడన్నది పురాణ కథ. గౌతమ మహర్షి ఒకానొకప్పుడు, గోహత్య చేసి పరితాపంతో తపస్సు చేయగా, లక్ష్మీసమేతుడై నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ తరవాత ఇక్కడే యోగ, ఉగ్ర రూపాలతో విగ్రహుడై స్వయంభుగా వెలిశాడు. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడి శివలింగాన్ని సేవించాడని, సీతారాముల వల్ల రామలింగేశ్వర నామధారి అయ్యాడనీ మరో కథ. ఈ ఆలయంలో సైకత లింగమూ కనిపిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దక్షిణాభిముఖీగంగా యత్రోదేవోనృకేసరీ/ తచ్చిధర్మపూరీ క్షేత్రం కాశ్యాః శతగుణం మహత్'- కాశీ క్షేత్రం కన్నా ధర్మపురి నూరు రెట్లు గొప్పదని ఈ శ్లోకం చెబుతోంది. పార్వతీదేవి విష్ణుధ్యానంలో ఉన్న శివుణ్ని ప్రశ్నించి, 'గురుగీత'ను ప్రసాదించింది. అదేవిధంగా, గంగాదేవి శివుణ్ని అలరించి భూలోకంలో తనకు ఒక విశిష్ట స్థానం కల్పించమని కోరింది. ఆ సమయంలో త్రయంబక క్షేత్రంలో గౌతముడు తపస్సు చేస్తున్నాడు. గోహత్యా పాతకం అతణ్ని వెంటాడుతోంది. 'దేవీ! నీ స్పర్శతో గౌతముడికి పాప విమోచనం కలిగించి, ధర్మపురి మీదుగా ప్రవహించి నారసింహుణ్ని దర్శించి, సముద్రా సంగమం చేయ'మని గంగాదేవిని ఆదేశించాడు పరమశివుడు. అందుకే గోదావరి గౌతమిగా ప్రఖ్యాతి చెందింది. గంగా భగీరథ సమానం అయింది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధర్మపురికి దక్షిణకాశీ అనే పేరూ దక్కింది. ఈ నదిలో స్నానం చేసి, పితృ దేవతలకు శ్రాద్ధ విధులు నిర్వహిస్తే, ముక్తి కలుగుతుందంటారు. కాశీలో మాదిరి ఇక్కడ పితృకార్యాలు చేసినవారు, వంశాభివృద్దిని పొందుతారని భక్తుల విశ్వాసం. యమధర్మరాజు పాపాత్ములను చూస్తూ, శిక్షిస్తూ, ఆ పాప సంచయం కొంత మూట కట్టుకున్నాడు. దాని పరిహారార్ధం ధర్మపురి చేరి నరసింహస్వామిని సేవించాడు. యముడి పాపాలన్నీ తొలగాయి. ఆయన ధర్మపురిని దర్శించాడనటానికి అక్కడున్న యమగుండాన్ని సాక్ష్యంగా చెబుతారు. యమగుండంలో స్నానం చేస్తే యమగండం తప్పుతుందంటారు. మదన పూర్ణిమ రోజు ఇక్కడ జరిగే తెప్పోత్సవం, రథోత్సవం కనువిందు చేస్తాయి. ధర్మపురి రథోత్సవంలో పాల్గొంటే వేయి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ రోజు వేలాది భక్తులు తరలివచ్చి 'శ్రీధర్మపురి నివాస- దుష్టసంహార నరసింహ దురితదూర' అంటూ ప్రార్థిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్