మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పరమయోగిని, భక్త కవయిత్రి. వెంగమాంబ 1730వ సంవత్సరానికి సరియైన సాధారణ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి పర్వదినం నాడు శ్రీవేంకటేశ్వరుని వరప్రసాదంగా తరిగొండ గ్రామంలో అవతరించింది. కానాల కృష్ణయామాత్యుడు, మంగమాంబలు అనే పుణ్య దంపతులు ఈమె తల్లిదండ్రులు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వెంగమాంబ రచనలలో మొట్టమొదటిది "తరిగొండ నృసింహశతకం". "తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" అనే మకుటంతో ప్రసిద్ధి చెందింది. "నారసింహవిలాసకథ" (యక్షగానం), "శివ నాటకం" (యక్షగానం), "రాజయోగామృతసారం" (ద్విపద కావ్యం), "బాలకృష్ణనాటకం" (యక్షగానం) అనే కృతుల్ని తరిగొండలో రచించింది.
ఈ కవయిత్రి దైవప్రేరణతో తరిగొండను విడిచి, అడవిదారుల గుండా పయనించి తిరుమలక్షేత్రం చేరుకుంది. తిరుమలలో ఈమె తొలి రచన "విష్ణు పారిజాతం" (యక్షగానం) అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అక్కారం వేంకట్రామ దీక్షితులు అనే అర్చకుల పెద్ద వల్ల ఈమెకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అందువల్ల వెంగమాంబ తిరుమల దేవాలయానికి దాదాపు పదిమైళ్ల దూరంలో నెలకొని ఉన్న తుంబురుకోన అనే కొండగుహలో అయిదేళ్ళు తీవ్రంగా తపస్సాధన చేసి, అపూర్వమైన ఆధ్యాత్మిక భగవత్ సాక్షాత్కార అనుభూతిని పొందింది.
ఆ కొండగుహ "తరిగొండ వెంగమాంబ గుహ"గా నేటికీ వ్యవహరింపబడుతోంది. ఆ తుంబురుకోనలో నివసించే చెంచువారి జీవన విధానాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ కవయిత్రి "చెంచు నాటకం" అనే యక్షగానాన్ని సహజ సుందరమైన శైలిలో రచించింది.
వెంగమాంబ మరల తిరుమల చేరింది. చేరిన వెంటనే ఏకపాదం మీద నిలబడి, ఆనందనిలయాన్ని వీక్షిస్తూ అత్యాశువుగా భక్తి, ప్రపత్తులతో "శ్రీ వేంకటేశ్వర కృష్ణ మంజరి" అనే స్తుతికావ్యాన్ని గానం చేసింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
తుంబురుకోన నుండి తిరుమల చేరిన అనంతరం తరిగొండ వెంగమాంబ తన మఠానికి ఎదుటగల ఎత్తైన ప్రదేశంలో పూల మొక్కలతో కూడిన తులసీ వనాన్ని (బృందావనం) నెలకొల్పింది. ఆనాటి నుండీ ఆ ప్రశాంత పవిత్ర బృందావనంలో అక్షరాకృతి నొందిన ఆమె రచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
శ్రీరుక్మిణీ నాటకం (యక్షగానం)
గోపికా నాటకం (గొల్లకలాపం – యక్షగానం)
శ్రీభాగవతం (ద్విపద కావ్యం)
శ్రీవేంకటాచల మాహాత్మ్యం (పద్య ప్రబంధం)
అష్టాంగయోగసారం (పద్య కావ్యం)
జలక్రీడావిలాసం (యక్షగానం)
ముక్తికాంతావిలాసం (యక్షగానం)
వాసిష్ఠ రామాయణం (ద్విపద కావ్యం) అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పైన పేర్కొన్న కృతులేకాక, ఈ మహాకవయిత్రి జీవితకాలమంతటా ఆయా సన్నివేశాలలో భక్తి, వేదాంతభావభరితాలు, సందేశాత్మకమైన అనేక శ్లోకాలను, పద్యాలను, పాటలను అత్యాశుధోరణిలో ప్రజలకు ప్రబోధించింది.
సువిస్తృతమైన, వైవిధ్య సాహిత్య సేవతో పాటు, ఈ భక్త కవయిత్రి శ్రీవారి ఏకాంతసేవ సందర్భంలో "నిత్య ముత్యాల హారతి" కైంకర్యాన్ని శాశ్వతంగా నెలకొల్పింది. ఈ కైంకర్యాన్నిబట్టే "తాళ్ళపాకవారి లాలి – తరిగొండవారి హారతి" అనే అర్థవంతమైన సూక్తి అవతరించింది. ఈ సూక్తిలోని తొలి సగం అన్నమయ్యను, మలిసగం వెంగమాంబను సూచిస్తోంది.
ఈ విధంగా ఈ యోగీశ్వరి ఒకవైపు సాహిత్యసేవకు, ఇంకొవైపు శ్రీస్వామివారి కైంకర్యాలకు, మరొకవైపు శిష్యులకు, శిష్యురాండ్రకు తత్వోపదేశాలను కొనసాగించింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ: 9494981000
టాపిక్