సావిత్రీ గౌరీ వ్రత మహాత్మ్యాన్ని తెలిపే కథ- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.
పరమపవిత్రమైన పుష్యమాస ఉత్తరాయన పుణ్యకాలంలో సౌభాగ్యాన్ని ప్రసాదించి, ముక్తినిచ్చే సౌభాగ్య గౌరీవ్రతాన్ని ఆచరించి స్త్రీలందరూ భోగభాగ్యాలతో విరాజిల్లాలని అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పౌరోహిత్యం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి బ్రాహ్మణునకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆ శిశువుకు ఇందుమతి అని నామకరణం చేసి గారాబంగా పెంచాడు. ఆమెకు యుక్తవయసు రాగానే తల్లిదండ్రులు వివాహం చేయడానికి పూనుకున్నారు. కొంత కాలానికి సదాచార పరాయణుడు, భూతదయ కలిగినవాడు, నిత్యసత్య వచనుడు, నిరంతరం భగవన్నామ స్మరణ చేసే మిత్రశర్మ అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు.

మిత్రశర్మ స్వభావానికి విరుద్ధమైన లక్షణాలు కలిగింది ఇందుమతి. తండ్రి అతి గారాబంతో పెంచడంతో ఆమె యవ్వన గర్వంతో కన్నూమిన్నూ గానక పెద్దలను దూషిస్తూ ఉండేది. భర్తను, అత్తమామలను మాటలతో చేతలతో దూషిస్తూ ఉండేది. స్త్రీజాతి సహజగుణాలైన బొట్టు కాటుక, పసుపు కుంకుమలను పెట్టుకొనక, భర్త చెప్పినా వినక దూషిస్తూ ఉండేది. తాను అందగత్తెనన్న అహంకారంతో సద్గుణాలు వదిలి దుర్గణాల వైపు పయనించసాగింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కొంతకాలానికి ఇందుమతి భర్త పరలోకగతుడయ్యాడు. భర్త మరణించడంతో కూతురిని పుట్టింటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. సద్గుణవంతుడైన అల్లుడు మరణించడంతో విచారించేవారు ఇందుమతి తల్లిదండ్రులు. ఇందుమతి ప్రవర్తనకు ఇరుగుపొరుగు వారు అసహ్యించుకునేవారు. ఆ పిల్లకు కలిగిన వైధవ్యానికి విచారించక ఆమె పట్ల నిర్దయగా ప్రవర్తించసాగారు. మనశ్శాంతి కోసం తమ కుమార్తెను వెంటబెట్టుకుని తీర్ధయాత్రలకు బయలుదేరారు ఇందుమతి తల్లిదండ్రులు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వారు దేశాలు తిరుగుతూ, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దేవీ దేవతలకు తమ మనస్సులోని ఆవేదనను మొరబెట్టుకునేవారు. చివరగా కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆది దంపతులను కీర్తిస్తూ తమ మనసులోని ఆవేదనను తీర్చి, తమ కుమార్తెకు చక్కని జీవితాన్ని ప్రసాదించమని విన్నవించుకున్నారు.
పార్వతీపరమేశ్వరులకు వారి పట్ల దయకలిగి ప్రసన్నత పొంది మారువేషాలతో వారికి కనిపించి "మీరెందుకు పుణ్యక్షేత్రాలను తిరుగుతూ వేదనామయ జీవితాన్ని అనుభవిస్తున్నారు" అని అడిగారు. అందుకు వారు "అయ్యా! ఈమె మా అమ్మాయి. ఆమె భర్త మరణించాడు. లేక లేక కలిగిన మా అమ్మాయికి వైధవ్యం ప్రాప్తించడంతో ఆ దుఃఖాన్ని భరించలేక ఇలా
తీర్థయాత్రలు చేస్తూ దేవతలను ప్రార్థిస్తున్నాం" అని చెప్పారు. అప్పుడు ఆ ఆదిదంపతులు "అయ్యో! ముక్కుపచ్చలారని ఈ అమ్మాయికి వైధవ్యం కలిగినందుకు ఎంతో విచారిస్తున్నాం. మానవ సహజంగా మీరూ ఈ దురవస్థకు విచారిస్తున్నారు. దీనికి తగు పరిష్కారం ఆలోచించాలి.
మీ అమ్మాయి పూర్వజన్మలో సౌభాగ్య గౌరీవ్రతం చేయకుండా నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితంగానే ఈ దుస్థితి తటస్థించింది. ఇప్పటికైనా మీ అమ్మాయి చేత సౌభాగ్య గౌరీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించి ఉద్యాపన చేయించండి. ఎంతో శుభం కలుగుతుంది" అని చెప్పి వారు వెళ్లిపోయారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆ దంపతుల మాటలను ఆలకించి, వారికి మనస్సులోనే నమస్కరించి తమ ఊరికి ప్రయాణమయ్యారు వారు. ఇంటికి చేరుకోగానే మంచి ముహూర్తం చూసి కూతురి చేత శాస్త్రవిధిగా నోము నోయించి ముత్తయిదువకు సత్కారాలనొనర్చి, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి, వ్రతకథను విని అక్షింతలు శిరస్సుపై ధరించి నెమ్మదించిన మనసుతో సంతృప్తి చెందారు.
వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇందుమతితో నోయించారు తల్లిదండ్రులు. కరుణాంతరంగయైన భువనేశ్వరి ప్రసన్నురాలై వరాలనొసగి, దీవించింది. జగన్మాత గౌరీదేవి చల్లని చూపుతో ఇందుమతి ముక్తిని పొంది, మరుజన్మలో రాజవంశంలో జన్మించి, తగిన భర్తను పొంది జీవితాంతం చక్కని సిరిసంపదలతో సౌభాగ్యంతో విరాజిల్లి జన్మను చరితార్థం చేసుకుంది.
పరమపవిత్రమైన పుష్యమాస ఉత్తరాయన పుణ్యకాలంలో సౌభాగ్యాన్ని ప్రసాదించి, ముక్తినిచ్చే సౌభాగ్య గౌరీవ్రతాన్ని ఆచరించి స్త్రీలందరూ భోగభాగ్యాలతో విరాజిల్లాలని అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం