Sri rama navami 2024: రామ నామం జపిస్తే చాలు అన్ని పాపాలు తొలగిపోతాయని అంటారు. భారతదేశంలోని అనేక ప్రసిద్ధ రామాలయాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించుకుంటే జీవితం ధన్యం అయిపోతుంది.
మర్యాద పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాముడు ఆదర్శమైన కుమారుడిగా, ఆదర్శమైన భర్త, ఆదర్శమైన అన్నగా అన్ని విధాలుగా అందరికీ అదర్శప్రాయుడిగా నిలిచాడు. భారతదేశంలో అనేక రామాలయాలు ఉన్నాయి. వాటిలోని కొన్ని రామాలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలోనే ప్రసిద్ధ రామ మందిరాలలో భద్రాచలం ఒకటి. సీతను రక్షించేందుకు లంకకు వెళ్లే సమయంలో గోదావరి నదిని శ్రీరాముడు దాటాడని, ఆ ప్రదేశమే ఇప్పుడు భద్రాచలంగా పిలుస్తున్నారని స్థల పురాణాలు చెబుతున్నాయి. కొత్తగూడెం జిల్లా గోదావరి నది ఒడ్డున ఈ ఆలయాన్ని కంచర్ల గోపన్న నిర్మించాడు. ఒక రోజు రామయ్య గోపన్న కలలోకి వచ్చి కొండమీద తనకి గుడి కట్టించమని కోరాడట.. అలా ఈ శ్రీరామ దివ్య క్షేత్రం ఏర్పడిందని అంటారు. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీతా ,లక్ష్మణులు ఉన్నట్లు చెబుతారు.
శ్రీరాముడు జన్మస్థలం. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య హిందువులకు ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. శ్రీరామనవవి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
మధ్యప్రదేశ్ లోని ఓర్చాలోని ఈ ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ శ్రీరామ ఆలయాలలో ఒకటి. బెట్వా నది ఒడ్డున ఉంది. ఓర్చా రాణి శ్రీరాముడికి పరమ భక్తురాలు. ఒకరోజు రాణి అయోధ్యకు వెళ్లి రాముడిని తన రాజ్యానికి రమ్మని కోరిందట, రాముడు ఆమెతో వచ్చేందుకు అంగీకరించాడు. అయితే అక్కడ ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళకూడదు అని షరతు విధించి మాట తీసుకుందని చెబుతారు. అలా రాముడు అక్కడ కొలువుదీరాడని అంటారు. ఇక్కడ రాముడుని దేవుడిగా కాకుండా రాజుగా ఆరాధిస్తారు.
ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. 400 ఏళ్ల క్రితం రఘునాథ నాయక్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ గర్భగుడిలో రాముడు, సీతా వివాహ భంగిమలో కొలువై ఉంటారు. శతృఘ్నుడు ఎడమవైపు ఉండగా భరతుడు రాముడికి గొడుగు పట్టుకుని ఉంటాడు. ఎప్పటిలాగే లక్ష్మణుడు కుడివైపున విల్లు పట్టుకొని కనిపిస్తాడు.
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో పంచవటి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో ఇక్కడ బస చేశాడని చెబుతారు. పశ్చిమ భారతదేశంలో ఉన్న ఆధునికమైన రామాలయం ఇది.
ఎక్కడ చూసినా సీతారాముల వెంట లక్ష్మణుడు తప్పనిసరిగా ఉంటాడు. అయితే శ్రీరాముడి పక్కన లక్ష్మణుడు లేని ఆలయం ఇదొక్కటే. అది మరి ఎక్కడో కాదు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఉంది. ఇక్కడ లక్ష్మణుడు లేని రామాలయం ఉంది. దేశంలోనే ఇలాంటి ఆలయం ఇదొక్కటే ఉంది.
శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామ స్వామికి కళ్యాణ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుపుతారు. ఏకశిలా నగరంగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటంటే హనుమంతుడు శ్రీరాముడి పక్కన ఉండదు.
కేరళలోని త్రిసూర్ లో ఈ ఆలయం ఉంది. ఆలయంలోని రాముడిని త్రిప్రయర్ గా పిలుస్తారు. పురాణాలలో పేర్కొన్నట్లుగా శ్రీరాముడు ఇక్కడ శ్రీకృష్ణుడిగా పూజలందుకుంటాడు.