Sravana masam 2024: శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం? ఈ మాసంలో వచ్చే పండుగలు ఏంటి?
Sravana masam 2024: ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో వచ్చిన పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Sravana masam 2024: మరికొన్ని రోజుల్లో ఆషాడమాసం ముగియపోతుంది. శ్రావణమాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణమాసంగా పరిగణిస్తారు. హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణమాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదోది.
ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రవణా నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెబుతారు.
శ్రావణ మాసం పండుగలు
ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. పార్వతి దేవికి ఉన్న మరొక పేరే మంగళ గౌరీ. కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని ఈరోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శివారాధన ముఖ్యం
శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, శమీ ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. క్షీర సాగర మథనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు. దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని శాంతింపజేసేందుకు అభిషేకం నిర్వహిస్తారని చెబుతారు. అందుకే శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా శివాభిషేకం నిర్వహిస్తారు.
శ్రావణ మాసంలో పండుగలు
మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ దేవి వ్రతంతో పాటు నాగ పంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణమాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది.
ఈ ఏడాది శ్రావణమాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మొదటి శ్రావణ సోమవారం కూడా అదే రోజు అవుతుంది.
శ్రావణ సోమవారాలు
శ్రావణ సోమవారం ఆగస్ట్ 5
రెండో శ్రావణ సోమవారం ఆగస్ట్ 12
మూడవ శ్రావణ సోమవారం ఆగస్ట్ 19
నాలుగో శ్రావణ సోమవారం ఆగస్ట్ 26
ఐదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ 2 అమావాస్య రోజు వచ్చింది.
శ్రావణ మంగళవారాలు
ఇక శ్రావణ మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైనవి.
మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ 6
రెండో శ్రావణ మంగళవారం ఆగస్ట్ 13
మూడవ శ్రావణ మంగళవారం ఆగస్ట్ 20
నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్ట్ 27