మార్చి 29న సూర్యగ్రహణం.. ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకోండి!-solar eclipse is on march 29th check what to do on this day and follow these remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 29న సూర్యగ్రహణం.. ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకోండి!

మార్చి 29న సూర్యగ్రహణం.. ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

సూర్యగ్రహణం గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకోవచ్చు.

సూర్యగ్రహణ ప్రభావం

మార్చి 29, 2025 శనివారం ఫాల్గుణ మాస అమావాస్య చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉండగా, సూర్యుడు, చంద్రుడు, రాహువు ముగ్గురు మీన రాశిలో సంచరించే సమయంలో రాహుగ్రస్త్ర సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

భారతదేశంలో సూర్యగ్రహణ నియమాలు పాటించాలా?

చిలకమర్తి పంచాంగ రీత్యా, ధృక్ సిద్ధాంత పంచాంగ రీత్యా ఆధారంగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించడం లేదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించకపోవడం చేత భారతదేశంలో ఉండువారు ఈ సూర్యగ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. భారతదేశంలోని ఆలయాలను మూసివేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.

గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

ఈ సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికా మరియు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపించొచ్చని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాబాధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్య గ్రహణం ఏర్పడటం చేత, ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు.

  1. విదేశాలైన అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కలిపించవచ్చు.
  2. ఈ సూర్య గ్రహణం ఏర్పడు పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ద వాతావరణం పెరగడం, ఆర్థికమాంద్యం కలగడం, ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ రాశులకు ఎలాంటి ఫలితాలు?

  1. ఈ సూర్య గ్రహణ ప్రభావం మీన రాశికి, మేష రాశికి సింహ రాశికి, ధనస్సు రాశికి చెడు ఫలితాలను సూచిస్తున్నాయి.
  2. వృషభం, మిథునం, తుల రాశులకు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.
  3. మిగిలిన రాశులకు మధ్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గ్రహణ సమయంలో విదేశాల్లో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరించే వారు పాటించాల్సిన నియమాలు:

  1. సూర్య గ్రహణ సమయంలో ఉపనయనం అయిన వారు గాయత్రీ జపం ఆచరించడం మంచిది.
  2. ఉపనయనం కాని వారు గురువుల ద్వారా పొందినటువంటి మంత్రోపదేశాన్ని ఆచరించడం మంచిది.
  3. సూర్య గ్రహణ సమయంలో సూర్యారాధన చేయడం, రాహు గ్రహ జపం చేయడం మరియు దుర్గాదేవిని ఆరాధించడం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
  4. సూర్య గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం మధ్యలో మధ్య స్నానం, గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేయాలని చిలకమర్తి తెలిపారు.
  5. గ్రహణ సమయంలో ఆహారం వంటి వాటిపైన దర్బను ఉంచడం మంచిది.
  6. గ్రహణ సమయంలో ధ్యానం ఆచరించడం శ్రేష్టమని చిలకమర్తి తెలిపారు.

ఈ రకంగా సూర్య గ్రహణ నియమాలను పాటిస్తూ సూర్యారాధన, రాహుగ్రహ జపం, దుర్గాదేవీ ఆరాధన చేసిన వారికి శుభఫలితాలు కలుగుతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

HT Telugu Desk

సంబంధిత కథనం