సింహాచల స్థల పురాణం, శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!-simhachalam sthala puranam and interesting things to know about varaha lakshmi narasimha swamy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సింహాచల స్థల పురాణం, శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!

సింహాచల స్థల పురాణం, శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన రోజుల్లో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. సింహాచల స్థల పురాణం, శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో.

సింహాచల స్థల పురాణం, శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో సింహాచలం ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయముగా ప్రస్తుతం సింహాచలం భాసిల్లుతోంది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన రోజుల్లో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సింహాచలం చరిత్ర

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిసాడు.

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు

ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించినా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి కొడుకుని చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు.

ప్రహ్లాదుడుని రక్షిస్తాడు

విసిగిన హిరణ్యకశిపుడు – "విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా? ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు!" – అని స్తంభాన్ని పగలగొట్టగా, విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుని రక్షించాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నిజరూప దర్శనం

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ ఆరాధించాడు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా, ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల అతనికి చందనంతో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేలా చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది.

ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చేందుకు చందనంతో పూత పూస్తుంటారు.

నరసింహుని అవతార నిజరూపం

వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో – వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూపదర్శనం) ఆలయ అధికారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఉత్సవం ముందురోజు అర్థరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.