శ్రీశైలం శైవ భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. శ్రీ ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడ పాదయాత్ర చేశారు. ఈ ఆలయ చరిత్ర ఎన్నో శతాబ్దాల క్రితం మొదలైందని భావించబడుతుంది. శివపార్వతుల ప్రేమకు, పరమశివుని అనుగ్రహానికి నిలువెత్తు ఉదాహరణ.
నరుల పాపాలను హరించగల పవిత్ర తీర్థక్షేత్రంగా భావించబడుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీశైల యాత్ర అనేది భక్తికి, త్యాగానికి, శాంతికి మార్గదర్శకమవుతుంది. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాకుండా ఆత్మాన్వేషణకు పునాది.
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీమల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవికి నిలయమైన ఈ మహా క్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై. ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండు వేల సార్లు గంగా స్నానం చేసినా, నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైలమల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కాందపురాణం చెబుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శిఖర దర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందు వల్ల కలిగే ఫలాన్ని, కన్యా దానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందు వల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000