తొలి ఏకాదశి విశిష్టత.. ఆరోజు ఏం చేయాలో తెలుసుకోండి
తొలి ఏకాదశి పండుగ విశిష్టతను, అలాగే ఆరోజు ఏం చేయాలో తెలుసుకోండి. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ వివరాలు అందించారు.
మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో ఏకాదశి ఒకటి. మొత్తం 24 ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉందని అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ద ఏకాదశిగా) జరుపుకుంటారు. ఈనె 29న ఈ తొలి ఏకాదశి పండగ జరుపుకోనున్నారు. దీనినే “శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహవిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు. గనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు.
నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది.
అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు (24) ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాల కొకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏకాదశి కథ
ఏకాదశి అంటే పదకొండు అని అర్ధము. ఐతే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో ఇలా చెప్పారు. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్మ్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినవారు సమస్త వ్యథల నుంచి విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణం చెబుతోంది.
తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు.. తన సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపకేస్తాడు. ఆమెనే “ఏకాదశి” అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుతుంది. 1. సదా మీకు ప్రియముగా ఉండాలి. 2. అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలందుకోవాలి. 3. నా తిథి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి.
మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఈ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. స్వామి వారికి దీపం వెలిగించి, పూలు పండ్లు, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసీ దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాదులు ముగించి స్వామి వారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి.
ఏకాదశి రోజున మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. చెడు చూడరాదు. చెడు మాట్లాడరాదు. చెడు వినరాదు.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ