రేపు పద్మినీ ఏకాదశి.. 19 ఏళ్ల తరువాత వస్తున్న బ్రహ్మ యోగం
రేపు జులై 29, 2023న పద్మినీ ఏకాదశి వస్తోంది. ఈ ఏకాదశి వెనక ఉన్న ఇతిహాస వృత్తాంతం తెలుసుకోండి.
పద్మినీ ఏకాదశి కథ మీకు తెలుసా? త్రేతా యుగంలో కృత వీరుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. రాజుకు అనేక వివాహాలు జరిగాయి. అయినప్పటికీ అతనికి సంతానం లేదు. సంతానం కోసం రాజు చాలా విచారించాడు. కఠినమైన తపస్సు కూడా చేశాడు. రాణులు కూడా పిల్లల కోసం తపస్సు చేశారు. కానీ వారి తపస్సు ఫలించలేదు.
ట్రెండింగ్ వార్తలు
అటువంటి పరిస్థితిలో రాజు భార్యల్లో ఒకరైన పద్మిని ఈ సమస్యకు పరిష్కారం చూపమని మాత అనసూయను అడుగుతుంది. అధిక మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు రాజుతో కలిసి ఉపవాసం చేయమని మాత అనసూయ సలహా ఇస్తుంది. అధిక మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల ఆ కోరిక త్వరగా నెరవేరి విష్ణుమూర్తి సంతోషించి సంతానం ప్రసాదిస్తాడని మాత అనసూయ చెబుతుంది.
ఈ సలహాకు అనుగుణంగా అధిక మాసం వచ్చినప్పుడు రాణి పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుంది. రోజంతా ఆహారం తీసుకోకుండా, రాత్రంతా మేలుకుని విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది.
రాణీ పద్మినీ ఆచరించిన ఈ ఉపవాసానికి సంతోషించి శ్రీహరి ఆమెకు మగ బిడ్డను ప్రసాదిస్తాడు. అలా రాణి పద్మినీ ఉపవాసం ఆచరించిన ఏకాదశికి పద్మినీ ఏకాదశి అనే పేరు వచ్చింది.
ఈ శనివారం జులై 29, 2023న పద్మినీ ఏకాదశి రాబోతుంది. 19 ఏళ్ల తర్వాత ఈరోజన బ్రహ్మయోగం ఏర్పడబోతోంది. ఈరోజున ఉపవాసం ఆచరించే వారికి, దానధర్మాలు చేసే వారికి పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తిని, శివుణ్ని ఆరాధించాలి. శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి. విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం పూట తులసీ మాతను ఆరాధించాలి.