జ్యేష్ట మాసం విశిష్టత.. ఈనెలలో ఏం చేస్తే పుణ్యం దక్కుతుంది?
జ్యేష్ట మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయని ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్త చక్రవర్తి శర్మ వివరించారు.
జ్యేష్ట మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని చెబుతారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
జేష్ట మాసంలో చేసే విష్ణసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.
జ్యేష్ట శుద్ద తదియ నాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.
జ్యేష్ట శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం.
జ్యేష్ట పూర్ణిమను మవహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ట నక్షత్రంతో కూడిన జ్యేష్ట మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది.
వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ... ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.