చైత్రమాస వైశిష్ట్యం.. నవరాత్రులు, వ్రతాల మాసం-significance of chaitra masam nava rathrulu and other festivals in this month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Significance Of Chaitra Masam Nava Rathrulu And Other Festivals In This Month

చైత్రమాస వైశిష్ట్యం.. నవరాత్రులు, వ్రతాల మాసం

HT Telugu Desk HT Telugu
Mar 24, 2023 09:51 AM IST

మహావిష్ణువును పూజించటానికి ఋతువులలో వసంత ఋతువు చాలా విశేషము. అలాంటి వసంత ఋతువులో తొలి మాసము చైత్రమాసము.

శ్రీమన్నారాయణుడి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం తెచ్చిన చైత్రమాసం
శ్రీమన్నారాయణుడి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం తెచ్చిన చైత్రమాసం

చైత్ర మాసములో మహావిష్ణువుకు సంబంధించిన అనేక అవతారాలు అనగా మత్స్యావతారం, రామావతారం, వరాహావతారం వంటివి ఈ మాసము యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలియచేస్తున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

“ఋతూనాం కుసుమాకరాం" అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసాన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు. ఉగాది, శ్రీరామనవమి దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞవరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీవ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.

చైత్ర శుద్ధ పాడ్యమి యుగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం, అవధానం వంటివి పండుగకే శోభనిస్తాయి. ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. సంవత్సరంలో మొదటగా చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రులు చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణంలోని ఎన్నో ముఖ్యఘట్టాలు ఈ తొమ్మిదిరోజులలో జరిగాయి.

చైత్ర శుద్ధ తదియ నాడు సౌభాగ్య గౌరీ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్యజయంతి కూడా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి, వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి రోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు. నాగులను కూడా ఈ రోజు పూజించి, పాలు నెయ్యి నివేదించాలి. ఈరోజు రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.

చైత్రశుద్ధ అష్టమి భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి. ఈరోజు ఊరూరా వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి యజ్ఞవరాహ జయంతి. భూమిని రక్షించటానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్రమాసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel