Krishnashtami 2024: రేపే కృష్ణాష్టమి, శుభ సమయం, పూజకు కావాల్సిన సామాగ్రి జాబితా ఇదే
Krishnashtami 2024: రేపు(ఆగస్ట్ 26) కృష్ణాష్టమి పండుగ జరుపుకోనున్నారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సందర్భంగా పూజకు శుభ సమయం, ఉపవాసం విరమించే సమయం, పూజకు కావాల్సిన సామాగ్రి గురించి తెలుసుకుందాం.
Krishnashtami 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీ కృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి వ్రతం చేస్తారు.
కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజా సమయం, పూజకు కావాల్సిన సామాగ్రి, ఉపవాసం విరమించే సమయం ఎప్పుడు అని తెలుసుకోండి.
శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?
అష్టమి తిథి ఆగస్ట్ 26న తెల్లవారుజామున 03:39 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 27వ తేదీ తెల్లవారుజామున 02:19 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను 26 ఆగస్ట్ 2024 సోమవారం జరుపుకుంటారు. 27 ఆగస్ట్ 2024న బంకే బిహారీ ఆలయంలో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు.
జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రం ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది.
పూజ సమయం
ఈ సంవత్సరం శ్రీ కృష్ణ భగవానుడి 5251వ జయంతి జరుపుకుంటారు. ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్ట్ 27వ తేదీ తెల్లవారుజామున 12.44 గంటల వరకు కృష్ణ జన్మాష్టమికి పూజాదికాలు జరుపుకుంటారు.
ఉపవాసం విరమించే సమయం
మత గ్రంధాల ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉపవాసం విరమించే సమయం ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటల తర్వాత ఉంటుంది. పరన్ ముహూర్తాన్ని ఆగస్ట్ 27వ తేదీ ఉదయం 12.44 గంటల తర్వాత చేయవచ్చు.
జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి జాబితా ఇది. శ్రీ కృష్ణ భగవానుని ఆరాధనలో ఇవి లేకపోతే అసంపూర్ణంగా అనిపిస్తుంది.
జన్మాష్టమి పూజలో ఇవి తప్పనిసరి
1. తులసి ఆకులు: శ్రీ కృష్ణుడు నారాయణుని అవతారం. తులసి ఆకులు లేని నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు అని నమ్ముతారు. కావున తులసి ఆకులను తీసి జన్మాష్టమికి ముందు ఉంచుకోవాలి. జన్మాష్టమి రోజున తులసిని తీయకూడదని అంటారు.
2. వెన్న, పంచదార మిఠాయి: కృష్ణుడి బాల రూపాన్ని సంతోషపెట్టడానికి వెన్న, చక్కెర మిఠాయి అందిస్తారు. శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. కావున జన్మాష్టమి శుభ సందర్బంగా భగవంతునికి మఖన్ మిశ్రీని సమర్పించండి. కృష్ణుడిని అందరూ వెన్న దొంగ అని పిలుస్తారని తెలిసిందే.
3. నెమలి ఈక: నెమలి ఈక శ్రీ కృష్ణుని కిరీటాన్ని అలంకరించింది. నెమలి ఈకలు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. అందువల్ల పూజ సమయంలో శ్రీకృష్ణుని కిరీటంలో లేదా చుట్టూ నెమలి ఈకలను ఉంచండి.
4. పంచామృతం: శ్రీ కృష్ణుని ఆరాధనలో పంచామృతాన్ని నైవేద్యం లేదా అభిషేకానికి ఉపయోగిస్తారు.
5. గంగాజలం- ఎలాంటి పూజలు చేసినా హిందూ మతంలో గంగాజలం పవిత్రమైనది పరిగణిస్తారు. అది లేకుండా పూజ అసంపూర్ణమైనది. కృష్ణుడికి గంగా జలంతో తప్పనిసరిగా అభిషేకం చేస్తారు.