Mangala gowri vratam: రేపే రెండో మంగళ గౌరి వ్రతం.. పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు తెలుసుకోండి
Mangala gowri vratam: ఆగస్ట్ 13 శ్రావణ మాసంలో వచ్చిన రెండో మంగళవారం. ఈరోజు మంగళ గౌరి వ్రతం ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? పూజా విధానం, పఠించాల్సిన మంత్రాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Mangala gowri vratam: శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజు విశిష్టమైనదే. ఆగస్ట్ 13న శ్రావణ మాసం రెండవ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ మాసంలో వచ్చిన నాలుగు మంగళవారాల్లో ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈరోజు పార్వతీ దేవిని మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని పాటిస్తే పెళ్ళైన దంపతులు వైధవ్యం రాకుండా సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ వ్రతం ఆచరిస్తారు.
మంగళ గౌరి వ్రత విశిష్టత
పార్వతీ దేవికి ఉన్న మరొక పేరే మంగళ గౌరి. తమ ఐదోతనం కలకాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతం ఆచరించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఆచరించిన మహిళలకు వైధవ్యం రాదని సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని చెబుతారు. హిందూ మతంలో మంగళ గౌరి వ్రతానికి పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. మంగళ దోషం ఉన్న మహిళలు, వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న స్త్రీలు వాటి దుష్ప్రభావాలు తగ్గించుకునేందుకు ఈ వ్రతాన్ని తప్పకుండా పాటిస్తారు.
పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. వివాహం జరిగిన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేయడం ఆరంభించాలి. ఈ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు వ్రతాన్ని చేయాలి. ఒకవేళ ప్రారంభించిన తర్వాత మిగతా వారాల్లో వ్రతం చేయడం కుదరకపోతే భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మంగళవారాలు చేసుకోవచ్చు. పెళ్ళయిన సంవత్సరం నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతం ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఆచరించాలి. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? వ్రతం చేసుకునేటప్పుడు పఠించాల్సిన మంత్రాలు ఏంటో తెలుసుకుందాం.
పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వ్రతం చేసుకోవాలనుకున్న స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. తర్వాత పూజ గదిలో ఒక పీట వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. గౌరి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అమ్మవారిని ఆభరణాలు, వస్త్రాలు, పూలతో అందంగా అలంకరించాలి. పదహారు రకాల మేకప్ వస్తువులు సమర్పించాలి.
పదహారు దూది ఒత్తులు తయారు చేసి వాటితో 16 దీపాలను వెలిగించాలి. గౌరి దేవి వ్రత కథను పఠించాలి. అమ్మవారిని స్తుతిస్తూ మంత్రాలు జపించాలి. ఖీర్ ను నైవేద్యంగా సమర్పించాలి. పెళ్లికాని స్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తున్నట్టయితే సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి. పసుపు, కుంకుమ, పూలలో మంగళ గౌరి ఉంటుందని అంటారు.
వ్రత నియమాలు
తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న స్త్రీ పక్కనే ఆమె తల్లి ఉండటం చాలా మంచిది. అలాగే తొలి వాయనం తల్లికి ఇవ్వడం మంచిది. ఆమె లేకపోతే అత్తకు లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో వ్రతం ఆచరించుకోవచ్చు. వ్రతం ఆచరించే వాళ్ళు ముందు రోజు నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలవాలి. వారి కాళ్ళకు పసుపు రాసి వాయనం ఇవ్వడం చాలా మంచిది. మొదటి సారి ఉపయోగించిన మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాలు ఉపయోగించాలి. పూజలో తప్పనిసరిగా గరికే, తంగేడు పూలు ఉపయోగించాలి. అమ్మవారి విగ్రహాన్ని వ్రతం పూర్తయిన తర్వాత వచ్చే వినాయక చవితి నాడు వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం మంచిది.
పఠించాల్సిన మంత్రాలు
వ్రతం ఆచరించే సమయంలో అమ్మవారి అనుగ్రహం కోరుతూ మంత్రాలు పఠించడం చాలా ముఖ్యమైనది.
సర్వ మంగళ మాంగల్యయే శివే సర్వార్థ సాధికే, శ్రణయయే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే||
జయంతి మంగళ కాళీ భద్ర కాళీ కపాలినీ, దుర్గా క్షమా శివధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే||
సర్వ బాధా వినిర్ముక్తో ధన్ ధాన్యే సుతాన్వితః, మనుష్యో మత్ ప్రసాదేన్ భవిష్యతి న సంశయః||
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.