పుష్యమాసంలో ఆచరించే వ్రతాలలో సావిత్రీ గౌరీ వ్రతం -బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు
ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి వ్రతాలు సహాయపడతాయి. వ్రతాచరణ సమయంలో క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దేవపూజ మొదలైనవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పుష్యమాసం చాలా పునీతమైన మాసం. పుష్యమీ నక్షత్రం శనైశ్చరుని నక్షత్రం. ఈ మాసంలో విష్ణువు, శివుడు, శని, సూర్యుడు, పితృదేవతలు భక్తుల చేత పూజలందుకుంటారు. వ్రతం అంటే నియమము. "వరం తనో దీతి వ్రతం" అని శబ్ద వ్యుత్పత్తి. నియమనిష్ఠలతో దేవీదేవతలను పూజించి వారి అనుగ్రహం కోసం వ్రతాలు చేస్తుంటారు. వ్రతమేదైనా సంకల్పం ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి వ్రతాలు సహాయపడతాయి. వ్రతాచరణ సమయంలో క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దేవపూజ మొదలైనవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పుష్య మాసంలో ఆచరించే వ్రతాలలో సావిత్రీ గౌరీ వ్రతం ముఖ్యమైనది. స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలవాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజా గృహాన్ని గోమయంతో అలికి శుభ్రం చేసుకుని రంగవల్లులను తీర్చిదిద్దాలి. తలకు నువ్వుల నూనె రాసుకుని, ముఖానికి, కాళ్లకు, మంగళసూత్రాలకు పసుపు రాసుకుని స్నానం చేయాలి. పూజా మందిరానికి నాలుగు వైపుల, లోపల పసుపు రాసి, కుంకుమ దిద్ది, మామిడాకులను కట్టాలి.
మందిరం లోపల ఎత్తయిన ఆసనాన్ని ఏర్పాటుచేసి పసుపు రాసి, కుంకుమ పెట్టి నూతన వస్త్రాన్ని ఆసనం పై పరవాలి. ఆ వస్త్రంపై కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాగి, వెండి, ఇత్తడి, బంగారంతో చేసిన ఏదో ఒక పాత్రను తీసుకుని పవిత్రమైన నీటితో లేదా బియ్యంతో నింపి దానిలో పసుపు రాసి, కుంకుమతో అలంకరించి సిద్ధం చేసుకున్న కొబ్బరికాయను అమర్చాలి. కొబ్బరికాయ పై కొత్త వస్త్రం చుట్టాలి. కలశానికి వెనుక గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. కలశానికి ముందు భాగంలో పసుపుతో చేసిన గౌరీదేవికి కుంకుమ అలంకరించి సిద్ధం చేసుకోవాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అలాగే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి.పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుని, గణపతికి షోడశోపచార పూజ చేసి, అష్టోత్తరం లేదా సహస్ర నామాలనుచదువుకుని నైవేద్యం సమర్పించాలి. అనంతరం పుసుపుతో చేసిన అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర/సహస్ర నామాలతో పూజించాలి. అమ్మవారిని తొమ్మిది రంగుల పువ్వులు, నవధాన్యాలతో అర్చించాలి. పూజకు ముందు నవతోరం గ్రంథి పూజ చేయాలి.
నవ అనగా తొమ్మిది. తోరంలో తొమ్మిది ముడులు ఉండాలి. తోరగ్రంథికి ప్రత్యేక మంత్రంతో అర్చించి ధరించాలి. అమ్మవారి అనుగ్రహం కలగడానికి మూడు తోరాలను సిద్ధం చేసుకుని ఒకటి పుణ్యస్త్రీకి కట్టి, మరొకటి అమ్మవారికి కట్టి, మిగిలిన తోరాన్ని పూజ చేసేవారు ధరించాలి. అనంతరం అమ్మవారికి చందన తాంబూలాలు సమర్పించి, ఫలములు, పాయసం నైవేద్యాన్ని నివేదించాలి. ఆ తరువాత అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులను సమర్పించాలి. విధివిధానంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలు, సౌభాగ్యం సిద్ధిస్తాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.