ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కలుగుతాయి. ఈ కాలంలో స్నానం, తర్పణం, జపం, దానం తదితర పుణ్యకార్యాలు చేయడం వలన అనేకమైన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి వన్నెండేళ్ల కోసారి వచ్చే ఈ పర్వదినాన పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఆచారంగా వస్తోంది. ఇది కేవలం శరీర శుద్ధికే కాకుండా, పాప ప్రక్షాళనకు, పితృదేవతల ఆశీస్సులకు, అంతిమంగా మోక్షానికి మార్గం సుగమం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ సంవత్సరం మిధున రాశిలో బృహస్పతి ప్రవేశంతో ప్రారంభం కానున్న సరస్వతీ నదీ పుష్కరాలు దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పనున్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాల విశిష్టత భారతీయ సంస్కృతిలో పుష్కరాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. పుష్కరం అంటే జల స్వరూపం. జలాది దేవతగా సమస్త తీర్థములకు నెలవై ఉండి తీర్థరాజు అను పేరుతో లోక కళ్యాణ కారకుడైనట్లు శాస్త్రములు తెలుపుతున్నాయి.
పూర్వం ధర్మాత్ముడైన తుందిలుడు తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి, ఆయన అష్టమూర్తులలో జలమూర్తిగా శాశ్వత స్థానం పొందాడు. అప్పటి నుండి అతడు పుష్కరుడుగా మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయ్యాడు. సృష్టి కార్యం కోసం బ్రహ్మ దేవుడు ఈశ్వరుని ప్రార్థించి పుష్కరుడిని తన కమండలంలోకి తెచ్చుకున్నాడు. తరువాత, ప్రాణుల జీవనాధారం కోసం బృహస్పతి బ్రహ్మను కోరగా, పుష్కరుడు బ్రహ్మను వీడనన్నాడు.
చివరికి బృహస్పతి మేషం నుండి మీనం వరకు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు మొదటి పన్నెండు రోజులు, అలాగే ఏడాది పొడవునా మధ్యాహ్నం రెండు ముహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో కలిసి ఉంటాడు. ఈ పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం పుణ్యప్రదం అని పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దేవ గురువు బృహస్పతి మేష రాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభ రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి, సింహ రాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి, కన్యా రాశిలో ఉన్నప్పుడు కృష్ణా నదికి, తులా రాశిలో ఉన్నప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు తామ్రవర్ణి నదికి, ధనస్సు రాశిలో ఉన్నప్పుడు బ్రహ్మపుత్రకు, మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి, కుంభ రాశిలో ఉన్నప్పుడు సింధు నదికి, మీన రాశిలో ఉన్నప్పుడు ప్రణీతా నదికి, పుష్కరాలు చెప్పబడ్డాయి అని చిలకమర్తి తెలిపారు.
వేదాల్లో సరస్వతీ నదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఋగ్వేదం ఆమెను “అమ్బీతమే, నదీతమే, దేవితమే" అంటూ స్తుతిస్తుంది. అంటే తల్లులలోకెల్లా గొప్ప తల్లి, నదులలోకెల్లా పవిత్రమైనది, దేవతలలోకెల్లా శ్రేష్టమైనది అని అర్థం. సరస్వతీ కేవలం ఒక భౌతికమైన నది మాత్రమే కాదు, ఆమె జ్ఞానానికి, వివేకానికి ప్రతీక. వ్యాసుడు, ఇతర కవులు, తాత్వికులు సరస్వతి దేవిని జ్ఞాన ప్రవాహంగా, పరమాత్మ స్వరూపిణిగా అభివర్ణించారు. ఆమె విద్యాధిదేవత, సంగీతానికి అధిపతి, వాక్కును ప్రసాదించే శక్తిగా పూజలందుకుంటుంది.
పుష్కరాల సమయంలో సరస్వతీని స్మరించడం అంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని పొందడానికి ఒక అడుగు ముందుకు వేయడమే. ఋగ్వేదంలో సరస్వతీ పేరు 50 సార్లకు పైగా ప్రస్తావించబడింది. ఆ నదిని యమునా, శతద్రు నదుల మధ్య ప్రవహించే జీవనదిగా వర్ణించారు. అది కేవలం నీటి ప్రవాహం కాదు. అది వాక్కు, జ్ఞానం, పూజా విధానాలకి మూలం. కాలక్రమేణ అది వాక్తేవిగా మారిపోయింది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000