హిందూ ధర్మం ప్రకారం ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని నమ్మిక. అయితే ఏకాదశి తిథుల్లో మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంటుంది. దీన్ని సఫల ఏకాదశిగా పిలుస్తారు. సఫల అంటే అభివృద్ధి, ఫలించడం అని అర్థం. జీవితంలో ఆనందం, విజయం, ధనాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రోజుగా భావిస్తారు. హిందూ నమ్మకాల ప్రకారం.. ఈ రోజు శ్రీహరినీ, లక్ష్మీ దేవినీ, శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల భక్తులకు శాంతి, ఆరోగ్యం, ధనం, శుభం కలుగుతాయి. సకల పాపాలు తొలగిపోతాయి. శరీర సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిళ్ళు తొలగిపోతాయని నమ్మిక. పురాణాల ప్రకారం సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే జీవితంలోని బాధలు తొలగిపోతాయి. సఫల ఏకాదశి తేదీ, శుభ సమయం, పూజావిధానం, ఉపవాస సమయాలను తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం ఈ ఏడాది సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10.29 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని పాటిస్తారు కనుక డిసెంబర్ 26 తేదీన సఫల ఏకాదశి పండుగను జరుపుకోవాలి.
తిథి ప్రారంభం - 25, డిసెంబర్, 2024 రాత్రి 10:29 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు - 27, డిసెంబర్ 2024 ఉదయం 12:43 గంటలకు
పరాణ సమయం (ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేసే) సమయం - ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారు మరసటి రోజు సూర్యోదయం తర్వాత అంటే 27, డిసెంబర్(ద్వాదశి రోజున) ఉదయం 7:12 గంటల నుంచి 9:16 గంటల మధ్య ఉపవాసాన్ని విరమించుకోవచ్చు.
బ్రహ్మాండ పురాణం ప్రకారం ధర్మరాజు శ్రీకృష్ణుడి మధ్య సఫల ఏకాదశి గురించి సంభాషణ జరిగించి. దాని ప్రకారం.. 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేథ యాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో సఫల ఏకాదశి రోజున ఉపవాసం చేసి భక్తితో విష్ణువును ఆరాధిస్తే అంత శుభం కలుగుతుంది. సఫల ఏకాదశి రోజు చేసే పూజలు జీవితంలోని అన్ని కష్టాలను, దురదృష్టాన్ని దూరం చేసి సంతోషాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. భక్తులు కోరుకున్న కోరికలు, కన్న కలలు నెరవేరేందుకు కావలసిన శక్తులు అందుతాయని విశ్వాసం.