Rakhi Festival History : శ్రీకృష్ణుడికి రాఖీ కట్టిన ద్రౌపతి.. రక్షా బంధన్ వెనక ఉన్న పురాణ కథలు ఏంటి?
Rakhi Festival History : భారతీయులకు రాఖీ పండగ చాలా ముఖ్యమైనది.. పవిత్రమైనది. చరిత్రలో ఈ పండగ గురించి చాలా గొప్ప గొప్ప కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సోదరికి సోదరుడు రక్షగా ఉంటానని చెప్పే.. ఈ పండగ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి.
రాఖీ పంగడ వచ్చిందంటే.. భారతీయులకు ఎంతో సంబరం. సోదరుడు సంతోషంగా ఉండాలని సోదరి రాఖీ కడుతుంది. సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ప్రతీ పండుగ వెనక ఒక కథ ఉంటుంది. అదేవిధంగా, రక్షా బంధన్ ఆచారం వెనుక కూడా ఇలాంటి పురాణ కథలు ఉన్నాయి. ఈ ఏడాది రాఖీ పండగ ఆగస్టు 30, 31 అంటున్నారు. రక్షా బంధన్ పండుగ ఎలా ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న కథలను తెలుసుకుందాం.
ఒకసారి శ్రీ కృష్ణుడి వేలికి గాయమైంది. రక్తస్రావం మొదలైంది. ఈ సమయంలో ద్రౌపతి తన చీర కొంగులోని కొంత భాగాన్ని చింపి.. రక్తస్రావం ఆపడానికి శ్రీకృష్ణుని వేలికి కట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపతి అనురాగానికి సంతోషపడిపోయాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నిండు సభలో ద్రౌపతికి అవమానం అయినప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు. అప్పటి నుంచి రాఖీ జరుగుతుందని కొంతమంది కథ చెబుతుంటారు.
యముడు, తన సోదరి యమున 12 సంవత్సరాలపాటు ఒకరినొకరు కలవలేదు. దీంతో యమునా దేవి చాలా బాధపడింది. గంగాదేవి.. తన సోదరిని కలిసి సంతోషపెట్టమని యమకు సలహా ఇస్తుంది. తన సోదరుడి రాక గురించి విని సంతోషించిన యమున, రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అతని కోసం వేచి ఉంటుంది. తన సోదరుడు యముడు ఇంటికి వచ్చిన వెంటనే అతడికి ఒక ధారాన్ని కడుతుంది.
మహావిష్ణువు గొప్ప భక్తుడు బలి. తపస్సు చేసి విష్ణువును మెప్పిస్తాడు బలి మహారాజా. తన ప్రదేశానికి రమ్మని విష్ణువును ఆహ్వానిస్తాడు. బలి కోరికను కాదనలేక విష్ణువు వెళ్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోయింది. భర్త వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉండడం లక్ష్మీకి బాధకలిగించింది. విష్ణువును తిరిగి రమ్మని కోరుతుంది. కానీ విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం తిరిగిరాలేను అని అంటాడు.
లక్ష్మీదేవికి ఒక ఆలోచన వస్తుంది. సాధారణ స్త్రీ వేషంలో బలి అంతఃపురానికి చేరుతుంది. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా, ఆమె బాలి ప్రశంసలను పొందుతుంది. ఒక రోజున, పవిత్రమైన ధారాన్ని బలికి కడుతుంది. లక్ష్మీని తన సోదరిగా స్వీకరించి, బలి కూడా ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీ తన నిజరూపంలో అవతరించి, విష్ణువును తిరిగి వైకుంఠానికి పంపమని కోరుతుంది. విష్ణువు లక్ష్మీతో వైకుంఠానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి ప్రతీ శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ జరుపుకొంటారు.
గమనిక : పైన చెప్పిన కథలు ప్రజల నమ్మకాల మీద ఆధారపడి ఉన్నది. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకోని అందించాం.