Raja parba 2024: రుతుక్రమాన్ని వేడుకగా జరుపుకునే పండుగ రాజ పర్బ.. ఇది ఎందుకు చేసుకుంటారో తెలుసా?
Raja parba 2024: రుతుక్రమాన్ని వేడుకగా జరుపుకునే పండుగ రాజా పర్బ. ఒడిశాలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇదీ ఒకటి. మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Raja parba 2024: ఇప్పటికీ కొంతమంది రుతుక్రమం అనే విషయం గురించి ఇతరులతో మాట్లాడేందుకు సిగ్గుగా భావిస్తారు. పీరియడ్స్ వచ్చిన సమయంలో ఇంట్లోని మహిళలు ఎటువంటి వస్తువులు ముట్టుకోకూడదని, ఇల్లంతా తిరగకూడదని చెప్తారు. అలా చేయడం మైలపడటమని, అదేదో అపచారంగా భావిస్తారు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ రుతుక్రమానికి సంబంధించి ఒక పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అదే ఒడిశాలో జరుపుకునే రాజ పర్బా ఉత్సవం. జూన్ 15వ తేదీన ఈ పండుగ వచ్చింది.
స్త్రీ, సంతానోత్పత్తి, వర్షాకాల ప్రారంభాన్ని సూచించే ఈ రాజ పర్బా ఒడిశా రాష్ట్రంలో చారిత్రక వారసత్వానికి ప్రసిద్ధి చెందినది. ఈ పండుగ గొప్ప పురాతన మూలాన్ని కలిగి ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఈ పండుగ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ రాజ పర్బాని “మిథున సంక్రాంతి” అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వర్షాకాలం ప్రారంభానికి గుర్తుగా చెప్తారు. ఈ కాలం రుతుచక్రం గుండా వెళ్తుందని విశ్వసిస్తారు.
రాజ అనే పదం రజస్వల నుంచి వచ్చింది. మూడు రోజులపాటు ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో మహిళలకు ఎటువంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ ఒక్కరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
రాజా పర్బా చరిత్ర, ప్రాముఖ్యత
భారతీయ పండుగలు సందర్భాల మాదిరిగానే రాజ పర్బాకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది. శ్రీ శక్తికి ప్రతిరూపమైన భూదేవి జూన్ మధ్యలో మూడో రోజులపాటు రుతుక్రమంలో ఉంటుందని అంటారు. పండుగ మొదటి రోజును ‘పహిలి రాజా’, రెండో రోజు ‘రాజా సంక్రాంతి’, మూడో రోజుని ‘బసి రాజా’ అంటారు. నాల్గవ రోజు 'వసుమతీ స్నాన' అని పిలుస్తారు.
భూదేవికి స్నానం చేయించడంతో ఆరోజు చక్రం ముగుస్తుందని భావిస్తారు. ఈ రాజ పర్బా అనే పండుగ భూదేవి మనకు ఇచ్చే సారవంతమైన భూమిని గౌరవించడానికి మంచి పంట కోసం ప్రార్థించే మార్గంగా భావిస్తారు.
రాజ పర్బా అనేక కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఈ సమయంలో మహిళలు అందమైన దుస్తులు ధరించి తమ రోజు వారి పనుల నుండి మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు. శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. ఆడవాళ్ళందరూ ఉయ్యాల ఊగుతూ సంబరాలు చేసుకుంటారు. జానపద పాటలు పాడుతూ, ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ మూడు రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
పండుగ మొదటి రోజు ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి రాబోయే వర్షాకాలంలో పంటలు సమృద్ధిగా పండాలని భూదేవికి ప్రార్థనలు చేస్తారు. దీన్నే పహిలి రాజా అని పిలుస్తారు. ఇక రెండవ రోజు సంప్రదాయ వంటకాలు చేసుకొని ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటూ ఆనందంగా గడుపుతారు. మూడవ రోజు బసి రాజా అని పిలుస్తారు. పనుల నుంచి విరామం తీసుకుని విశ్రాంతి వేడుకల్లో మునిగిపోతారు. ఇది వారికి ఆనందాన్ని ఇచ్చే రోజు. చివరి రోజు వసుమతి స్నాన అని పిలుస్తారు. భూదేవికి నీరు, పాలు సమర్పిస్తారు. ఈ ఆచారంతో పండుగ ముగుస్తుంది.
ఈ పండుగకు రుచికరమైన వంటకాలు చేసుకుంటారు. భూదేవతను పూజించడం వాన దేవుడికి నైవేద్యాలు సమర్పించడం వంటి ఆచారాలు పాటిస్తారు. రాజ పర్బా కేవలం స్త్రీలను, స్త్రీతత్వాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ. సంపన్నమైన పంట కోసం జీవనాధారమైన వర్షంపై ఆధారపడిన రైతులకు ఈ పండుగ ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎండల వల్ల ఎండిన నేల మీద చినుకులు పడటం దేవుడి ఆశీర్వాదంగా పరిగణిస్తారు.
టాపిక్