పురుషోత్తమ మాసం అంటే ఏమిటి? ఈనెలలో దాన ధర్మాలు ఎందుకు చేయాలి?
పురుషోత్తమ మాసం అంటే ఏమిటి? ఈనెలలో దాన ధర్మాలు ఎందుకు చేయాలో పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
పురుషోత్తమ మాసములో చేసే పూజలకు, దానాలకు అధిక ఫలితాలు ఉంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రతీ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మాస వైశిష్ట్యం గురించి పురాణాలు అనేక విషయాలుగా వివరాలను తెలియచేశాయి. అయితే పురాణాల ప్రకారం మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసము పురుషోత్తమ మాసమని స్వయముగా శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పురాణాలు తెలియచేశాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అధికమాసాన్ని పురుషోత్తమ మాసమని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పురాణాల ప్రకారం పురుషోత్తమ మాసములో విష్ణు ఆరాధన భగవత్ ఆరాధన తప్పా మరొక కార్యక్రమాన్ని ఆచరించకూడదు. ఆధ్యాత్మిక చింతన కలవారు మహావిష్ణువును పూజించేటటువంటివారు పురుషోత్తమ మాసము కోసం వేచి చూస్తారని శాస్త్రాలు తెలియచేశాయి. ఈ మాసములో భగవత్ ఆరాధనలు, విష్ణు సహస్రనామము వంటివి పారాయణ చేయడం, యజ్ఞయాగాదులు, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు, జపతప హోమాదులు, దాన ధర్మములు వంటివి ఆచరించాలి.
మామూలు మాసములో ఇవి ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, దానికంటే కొన్ని వేల రెట్లు అధిక ఫలము ఈ అధిక మాసము పురుషోత్తమ మాసములో వస్తుందని స్వయముగా మహావిష్ణువే చెప్పినట్లుగా పురాణాలు తెలియచేశాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పురుషోత్తమ మాసాన్ని జ్యోతిష్య శాస్త్రము అధికమాసముగా, మల మాసముగా, శూన్యమాసముగా పరిగణించబడినది. అందుచేత పురుషోత్తమ మాసములో వివాహము, గృహారంభము, గృహప్రవేశము, గర్భాదానము వంటి శుభకార్యములు చేయకూడదని చిలకమర్తి తెలిపారు.
ఈ పురుషోత్తమ మాసములో మహావిష్ణువును పూజించడం, అష్టాదశ పురాణాలను పఠించడం, రామాయణం, మహాభారతం వంటివి చదవడం, విష్ణు సహస్ర నామ పారాయణం, భగవద్దీత వంటివి చదువుకోవడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.
ఈ పురుషోత్తమ మాసములో నవధాన్యాలను దానం ఇవ్వడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ పురుషోత్తమ మాసములో శనగలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పంచిపెట్టడం వల్ల బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ పురుషోత్తమ మాసములో అన్నదానం, వస్త్రదానం, సువర్జదానం, గోదానం వంటి దానాలు ఆచదరించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియచేశాయని చిలకమర్తి వివరించారు.