ప్రతి గుడిలో గంట ఎందుకు ఉంటుంది.. గంటానాదంతో కలిగే లాభాలేంటి?
మనం ఏ గుడికి వెళ్లినా అక్కడ గంట కచ్చితంగా కనిపిస్తుంది. గుడిలో లేదా ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టడం పవిత్రమైనదిగా చెబుతుంటారు. ఇలా ప్రతి గుడిలో గంట ఎందుకు ఉంటుంది..? గంటానాదం వెనకున్న ఆంతర్యమేంటి?
గుడికి వెళ్లినప్పుడు దేవుడిని ఎంత భక్తితో మొక్కుతారో అంతే శ్రద్ధాభక్తులతో అక్కడున్న గంటను మోగిస్తుంటారు భక్తులు. ఇంట్లో కూడా పూజ చేసుకునే సమయంలో గంటను మోగించడం ఆనవాయితీగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజకైనా, అర్చనకైనా, స్వామికి నైవేద్యం సమర్పించడానికైనా గంటధ్వని తప్పనిసరిగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా హారతి సమయంలో ఈ గంట శబ్దానికి ప్రాముఖ్యత ఎక్కువ. అసలు గుడిలో లేదా పూజ సమయంలో గంట ఎందుకు కొడతారు..? ప్రతి గుడిలో గంట ఎందుకు ఉంటుంది..? గంటానాదం వెనుకున్న ఆంతర్యమేంటి తెలుసుకుందాం.
గుడిలో గంట ఎందుకు కొడతారు..?
హిందూ ఆచారాల ప్రకారం గంట కొట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది. గంటను కొట్టినప్పుడు వెలువడే ధ్వని చాలా ఘనంగా, లోతుగా, నిరంతరాయంగా వినిపిస్తుంది. ఇది ఆదిశబ్దమైన ఓంకారాన్ని సూచిస్తుంది. గుడికి వచ్చిన వారిలో లేదా ఇంట్లో పూజ చేసుకునే వారిలో ఇతర శబ్దాలు భక్తి చింతనకు, ఏకాగ్రతకు, అంతర్గత శాంతికి భంగం కలిగిస్తాయి. దైవారాధన సమయంలో గంటను మోగించడం వల్ల, లేదా ఆ శబ్దాన్ని వినడం వల్ల భక్తుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ గంటాధ్వని క్షణక్షణానికి మనస్సులో కలిగే రకరకాల ఆలోచనలు, ఆందోళనల నుంచి దూరంగా ఉంచుతుంది. దైవ సన్నిధికి వచ్చామని పదేపదే గుర్తు చేసి భక్తిపై మనస్సు లగ్నమయ్యేలా ప్రేరేపిస్తుంది. ఆలయంలో శంఖారావాలు, దీపాలు, సువాసనలు, ఆహార నైవేద్యాలు ఇవన్నీ కలిసి పరిపూర్ణ ఆధ్మాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.
ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ ప్రకారం.. ఏదైనా ఘనమైన, పవిత్రమైన ధ్వని వినిపించినప్పుడు మనసులోని ఆందోళనలు, ఆలోచనలన్నీ దూరమై ఏకాగ్రత, ప్రశాంతత నెలకొంటుంది. ఆ శబ్ద తరంగాలు మెదడుకు చేరి సృజనాత్మకతను పెంచుతాయి. మనోనేత్రం తెరుచుకునేందుకు ఈ ధ్వని చాలా బాగా తోడ్పడుతుంది. అంతేకాదు గంటా శబ్దం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొన్ని లాభాలున్నాయి. ఈ శబ్దం ద్వారా శరీరంలోని నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ బలపడతాయి. ఇంకా ఏకాగ్రత, వినికిడి జ్ఞానం మెరుగవుతాయి. వీటికి ఆధ్మాత్మికత తోడవడంతో ఆలయానికి వెళ్లిన వ్యక్తులు నూతన ఉత్తేజంతో, సానుకూల దృక్ఫథంతో బయటకు వస్తారు.
గంటలను సాధారణంగా నిర్దిష్ట లోహాలైన రాగి, ఇత్తడి లేదా పంచధాతువులు వంటి మిశ్రమాలతో తయారుచేస్తారు. పూజా గంటలు ఎవరి ఆరాధనకోసం ఉద్దేశించిన దేవతను బట్టి నిర్దిష్ట బొమ్మల ఆకృతులతో సిద్ధం చేస్తారు. శివారాధనలో ఉపయోగించే గంటలు నంది లేదా ఎద్దు బొమ్మలు ఉంటాయి. విష్ణువుని ఆరాధించేందుకు వాడే గంటలపై గరుడ, పాంచజన్య శంఖం లేదా సుదర్శన చక్రం ఉంటాయి.
మరి గుడిలోకి వెళ్లి గంటను కొట్టే ముందు చేయాల్సిన పనేంటో తెలుసా:
ఆలయంలోకి వెళ్లినప్పుడు గంట కొట్టే ముందు "ఆగమర్థం తు దేవానం, గమనార్థంతు రాక్షసం" అనే శ్లోకం పఠించాలి. "దైవత్వాన్ని ఆవాహన చేసుకునేందుకు నేను గంట మోగిస్తున్నాను. తద్వారా నాలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, గొప్పవైన సద్గుణ శక్తులు ప్రవేశించాలని వేడుకుంటున్నా" అని దీనికి అర్థం. గంటా శబ్బం చేస్తూ ఈ మత్రం పఠించడం వల్ల మనలోకి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి.. దైవాశీస్సులు, సానుకూల శక్తులు లభిస్తాయని నమ్మిక.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్