సప్తమోక్షపురీ క్షేత్రాలలో ఒకటైన పూరీ క్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించాలని ప్రతివారూ కోరుకుంటారు. పూరీ జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిపే రథయాత్రే గుర్తుకు వస్తుంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవం ప్రసిద్ధి చెందింది. ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మధన్యమైపోతుందని భక్తుల విశ్వాసం. రథయాత్రతో పాటు పూరీ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జగన్నాథుని ఆలయంలో సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. నీలాద్రిగా పిలిచే స్వామివారి విమానగోపురం ఎత్తు 214 అడుగులు. ఆలయాన్ని పైనుంచి చూస్తే శంఖాకారంలో కనిపిస్తుందని అంటారు. యుగాల నాటి జగన్నాథునికి ప్రస్తుతమున్న ఆలయాన్ని 1174వ సంవత్సరంలో కళింగరాజు అనంగభీమదేవుడు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. పూరీ పట్టణాన్ని అనేక సార్లు తుపానులు ముంచెత్తినా ఆలయం మాత్రం చెక్కుచెదరలేదని బ్రహ్మశ్రీ శర్మ తెలిపారు.
జగన్నాథుని ఆలయ శిఖరంపై కనిపించే సుదర్శన చక్రానికి "నీలచక్రం" అని పేరు. 214 అడుగుల ఎత్తున ఉన్న గోపురంపై తొమ్మిది వందల కిలోలపైగా ఉన్న ఈ చక్రాన్ని ఎలా ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు. అష్టధాతువులతో నిర్మితమైన నీలచక్రం ఎత్తు 11 అడుగులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పూరీ క్షేత్రంలో ఏ దిక్కు నుండీ చూసినా ఈ చక్రం మనవైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
జగన్నాథుని గోపురంపై ఉన్న నీలచక్రానికి అనుసంధానంగా ప్రతిరోజూ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ పతాక దర్శనం మూలమూర్తుల దర్శనంతో సమానమని భావిస్తారు. దీనికే 'పతితపావన' అని పేరు. పతాకాన్ని మార్చని రోజు వస్తే, పద్దెనిమిదేళ్లపాటు ఆలయాన్ని మూసివేయాలన్నది నిబంధన. అందుకే ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే పతాకం గాలికి వ్యతిరేకంగా రెపరెపలాడటం ఇప్పటికీ ఓ ఆశ్చర్యకరమైన విషయం.
జగన్నాథుని మూలవిరాట్టులు కొయ్యతో తయారుచేసినవి. ప్రతి పద్దెనిమిదేళ్లకోసారి "నవకళేబర ఉత్సవం" నిర్వహించి, పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ సంప్రదాయం కేవలం పూరీ క్షేత్రానికే ప్రత్యేకం. పాత విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే ఖననం చేస్తారు. మూలవిరాట్టులను తయారు చేయడానికి కేవలం వేపచెట్టు కొయ్యను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలు అన్ని అత్యంత గోప్యంగా, నియమనిష్టలతో జరుగుతాయి.
జగన్నాథుని మూలవిరాట్టులో "బ్రహ్మపదార్థం" అనే ఓ శిల ఉన్నట్లు చెబుతారు. నవకళేబర ఉత్సవ సమయంలో పాత విగ్రహంలోని బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. ఈ తంతును నిర్వహించే అర్చకుడు కళ్లకు గంతులు కట్టి, చేతులకు వస్త్రాలు చుట్టుకుని ఉంటాడు. ఇప్పటివరకు ఈ బ్రహ్మపదార్థాన్ని నేరుగా ఎవ్వరూ చూడలేదని అంటారు.
జగన్నాథ క్షేత్రంలోని వంటశాలకు "భోగమంటపం" అని పేరు. అక్కడ తయారయ్యే వంటకాలన్నింటికీ గంగ-యమున అనే రెండు బావుల నీటిని ఉపయోగిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీమహాలక్ష్మీదేవి స్వయంగా అదృశ్యరూపంలో వంటలపై పర్యవేక్షణ చేస్తారట. అందుకే పూరీలో ప్రసాదాన్ని "మహా లక్ష్మీ పాకం" అని పిలుస్తారు. ఒకేసారి యాభైవేలమందికి వంట చేయగల సామర్థ్యం ఉన్న ఈ వంటశాలలో వేడుకల సమయంలో లక్షమందికి సరిపడేలా వంటలు సిద్ధం చేస్తారు.
ప్రపంచంలో అతిపెద్ద వంటశాలగా పూరీ జగన్నాథుని వంటశాలే ప్రసిద్ధి. స్వామివారికి సమర్పించే నైవేద్యాలు, భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి. పాండాలు అనే పాకకళాకోవిదులు ముక్కుకు, నోటికి గుడ్డలు కట్టుకుని, వాసన చూడకుండా, భక్తితో నైవేద్యాన్ని సిద్ధం చేస్తారు. పొరపాటున ముక్కుకు గుడ్డ జారిపోతే, వండిన అన్నీ పదార్థాలను పారేసి, మళ్లీ కొత్తగా వండుతారు.
పూరీలో 56 రకాల ప్రసాదాలను నివేదించే ఆచారానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది జగద్గురువులైన ఆది శంకరులేనని చెబుతారు. ఆరుదఫాలుగా నైవేద్యాన్ని సమర్పించడానికి 166 రకాల పదార్థాలను తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని "మహాప్రసాదం" అని పిలుస్తారు. ఒకప్పుడు భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలన్నింటికీ శాంతి చేకూరాలని ఉద్దేశంతో ప్రతీ రాజ్యం తరఫున ఒక్కో ప్రసాదం చొప్పున 56 రకాల ప్రసాదాలను నివేదించేవారని చెబుతారు.
పూరీ రాజును జగన్నాథుని తొలి సేవకుడిగా భావిస్తారు. రథయాత్ర సమయంలో పూరీ మహారాజు "చెర్రా పహన్రా" అనే పూజాక్రియలో భాగంగా రథాలను శుభ్రం చేస్తారు. పూరీ మహారాణి జగన్నాథుని దర్శనానికి చాలా అరుదుగా వస్తారు. ఆమె దర్శనానికి వచ్చినప్పుడు మిగిలినవారెవరూ చూడకూడదనే సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ సమయంలో అర్చకులు మినహా మరెవరినీ ఆలయంలోకి అనుమతించరు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000