Prathamashtami 2024: ప్రథమ సంతానం కోసం జరిపే ప్రథమాష్టమి విశిష్టత, ఆచారాలు, పూజా విధానం
Prathamashtami 2024: కుటుంబంలో ఉండే ప్రథమ సంతానం కోసం జరిపే పండుగే ప్రథమాష్టమి. ఈ రోజున వారి విజయం కోసం, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హిందూ కుటుంబాలైన ఒడిశా వారు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ప్రథమాష్టమి ఒకటి. ఈ పండుగను 2024వ సంవత్సరంలో నవంబర్ 23న జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజున వస్తుంది. ఈ పండుగను పరుహ అష్టమి అని కూడా పిలుస్తారు. కుటుంబంలోని ప్రథమ సంతానం కోసం జరిపే ఈ పండుగ వివరాలిలా ఉన్నాయి.
పండుగ సమయం:
ప్రథమాష్టమి తేదీ: నవంబర్ 23, 2024
అష్టమి తేదీ ఆరంభం: నవంబర్ 22 సాయంత్రం 6గంటల 8 నిమిషాలకు
అష్టమి తేదీ సమాప్తం: నవంబర్ 23 సాయంత్రం 7గంటల 57నిమిషాలకు
ప్రథమాష్టమి 2024 ప్రత్యేకత:
ఒడియా పండుగ అయిన దీనిని కుటుంబంలోని ప్రథమ సంతానం కోసం జరుపుకుంటారు. వారికి చక్కటి ఆరోగ్యం, శ్రేయస్సు అందించాలని ప్రయత్నిస్తారు. ఇంటి ప్రథమ సంతానం కుటుంబ ఆచారాలను, సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశ్యంతో ఈ పండుగను జరుపుకుంటారు. తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడే బాధ్యత తనదేనని గుర్తు చేసే విధంగా ఈ పండుగ జరుపుతారు.
ఈ పవిత్రమైన రోజున కుటుంబంలోని వారంతా ఒక చోట కలుసుకుని జేష్ట దేవి అయిన షష్టి దేవిని పూజిస్తారు. ప్రథమ సంతానానికి కొత్త బట్టలు అందించి, వారి కోసం ఇష్టమైన వంటలను సిద్ధం చేస్తారు. ఎండూరి పితా అనే స్వీట్ ను కచ్చితంగా ప్రధాన వంటగా రెడీ చేస్తారు.
ప్రథమాష్టమి 2024 ఆచారం:
ఈ పర్వదినాన తల్లి తన స్వహస్తాలతో ప్రథమ సంతానానికి హారతిచ్చి దేవుళ్ల నుంచి తన బిడ్డకు రక్షణ దొరకాలని ప్రార్థిస్తుంది. దుష్ట శక్తుల నుంచి, చెడ్డ ఆలోచనల నుంచి తన బిడ్డ దూరంగా ఉంచాలని కోరుకుంటుంది. ఈ సందర్భంగా పెద్ద కూతురు/కొడుకుకు బహుమతులు కూడా ఇస్తారు. దేవుని సన్నిధానంలో పసుపు దారం ఉంచి పూజ అనంతరం మణికట్టుకు కట్టి రక్షణ దొరుకుతుందని విశ్వసిస్తారు.
ఈ రోజును ఒడిశాలోని భువనేశ్వర్ మహాప్రభు మరో రకంగా జరుపుకుంటారు. యాత్రగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
లింగరాజు యాత్ర:
ప్రథమాష్టమి వేడుకని భువనేశ్వర్ లింగరాజు సైతం యాత్రగా జరుపుకోవడం విశేషం. ఈ తిథి నాడు మహా ప్రభువు తన మేనమామ సన్నిధి అయిన కపాలి మఠంకు తరలి వెళ్తాడు. ఈ సన్నిధిలో తమ ఆరాధ్య దైవం వరుణేశ్వర్, బలదేవ్ లు కొలువై ఉంటారు. ఈ మఠం ప్రాంగణంలో పాపనాశిని పుష్కరిణి ఉంటుంది. ఈ రోజున పాపనాశిని జలం స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
తాంత్రిక ప్రాముఖ్యత
ప్రథమాష్టమి తాంత్రికులకు ఎంతో ప్రాముఖ్యమైనది. తంత్ర సాధకులు ఈ రాత్రిని ఎంతో కీలకంగా భావిస్తారు. ఈ తిథి నాడు ఆది శక్తి కాల రూపంలో అవతరించినట్లు తాంత్రికులు విశ్వసిస్తారు.