Pradosh vrat 2024: నేడే భౌమ ప్రదోష వ్రతం.. ఈరోజు శివుడిని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరతాయి
Pradosh vrat 2024: కొత్త ఏడాది జనవరి 9న ప్రదోష వ్రతం వచ్చింది. ఈరోజు భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి.
Pradosh vrat 2024: శివుడిని ఆరాధించేందుకు అత్యంత పవిత్రమైన రోజులుగా ప్రదోష వ్రతాన్ని పరిగణిస్తారు. ఆరోజు శివపార్వతులని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. ప్రదోష వ్రతలని త్రయోదశి తిథిలో శుక్ల పక్ష త్రయోదశి, కృష్ణ పక్ష త్రయోదశి రెంటింట్లోనూ పాటిస్తారు.
సూర్యాస్తమయం తర్వాత సమయం ప్రదోష వ్రతాన్ని ఆచరించడానికి ఉత్తమమైన సమయంగా సూచించబడుతుంది. ప్రదోష వ్రతం సోమవారం నాడు వస్తే దాన్ని సోమ ప్రదోష వ్రతం అంటారు. మంగళవారం నాడు వస్తే భౌమ ప్రదోష వ్రతం అంటారు. శనివారం వస్తే శని ప్రదోష వ్రతమని, ఆదివారం వస్తే రవి ప్రదోష వ్రతం అని పిలుస్తారు. 2024 సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం జనవరి 9న వచ్చింది. మంగళవారం రావడం వల్ల దీన్ని భౌమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు.
ప్రదోష వ్రతం మహాదేవుడు శివుడికి అంకితం చేయబడింది. ఈరోజున శివపార్వతులని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. ఈరోజు హనుమంతుడిని కూడా పూజిస్తారు.
ప్రదోష వ్రతం శుభ సమయం
పంచాంగం ప్రకారం పౌష్ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి జనవరి 8 రాత్రి 11.58 గంటల నుంచి జనవరి 9 రాత్రి 10.24 గంటల వరకు కొనసాగుతుంది. అందువల్ల జనవరి 9న ప్రదోష వ్రతం ఆచరిస్తారు. పూజ చేసేందుకు అనుకూలమైన సమయం సూర్యాస్తమయం తర్వాత. ఈరోజే తొలి మాసిక శివరాత్రి కావడంతో ఈసారి వచ్చిన ప్రదోష వ్రతం మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది.
పూజా విధి
ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివపార్వతులని పూజించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వేళ కూడా ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. శివ మంత్రాలు పఠించాలి. నిరు పేదలకు ఆహారం, డబ్బు దానం చేయాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి.
ప్రదోష వ్రతం రోజు చేయకూడని పనులు
ప్రదోష ఉపవాసం రోజు మాంసాహారం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ప్రదోష వ్రతం రోజున శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్ళు, కుంకుమ సమర్పించకూడదు. ఉపవాస సమయంలో కోపానికి దూరంగా ఉండండి. ఎవరినీ అనుమానించకూడదు. మనసు మొత్తం దేవుడి మీద లగ్నం చేసి శివనామస్మరణ చేసుకోవాలి.
ప్రదోష వ్రత కథ
పురాణాల ప్రకారం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోవడంతో కొడుకలని పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో తనని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది.
రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాయలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు. బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి తండ్రిని బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు.