Parashurama jayanti 2024: మాహిష్మతి రాజుని సంహరించిన పరశురాముడి జయంతి నేడే..
Parashurama jayanti 2024: మాహిష్మతి రాజుని సంహరించిన పరశురాముడి జయంతి నేడే. ముక్కోపిగా పేరుగాంచిన పరశురాముడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.
Parashurama jayanti 2024: వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ రోజు పరశురాముడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మే 10 వ తేదీ అక్షయ తృతీయతో పాటు పరశురాముడి జయంతి కూడా జరుపుకుంటున్నారు.

శ్రీ మహావిష్ణువు ఆరో అవతారంగా పరశురాముడు జన్మించాడు. భూమిపై నిరంకుశ రాజవంశాలను అంతం చేయడానికి పరశురాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హిందూ విశ్వాసాల ప్రకారం సప్త చిరంజీవి దేవుళ్ళలో పరశురాముడు ఒకడు. ఇప్పటికీ భూమ్మీద బతికే ఉన్నాడని అంటారు. పరశురాముడు జమదగ్ని మహర్షి, రేణుక దంపతులకు నాలుగో కుమారుడిగా జన్మించాడు. మత విశ్వాసాల ప్రకారం అన్యాయాన్ని, అధర్మాన్ని, పాపకర్మలను నాశనం చేసేందుకే పరశురాముడు జన్మించినట్లు చెబుతారు.
అమరుడు శివుడి పరమ భక్తుడు
పరశురాముడు మహా ముక్కోపి. పరమశివుడికి పరమ భక్తుడు. అమరుడిగా వరం పొందాడు. కలియుగంలో పరశురాముడు సజీవంగా ఉన్నాడు. శివుడు, విష్ణువు గుణగణాలను పొందిన వ్యక్తి పరశురాముడు.
శివుడికి పరమ భక్తుడైన పరశురాముడు శివుడి నుంచి వినాశక గుణాన్ని, విష్ణువు నుంచి కాపాడే గుణాన్ని పొందాడు. శివుడి అనుగ్రహం కోసం కఠినమైన తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడి నుంచి అనేక రకాల ఆయుధాలను పొందాడు. శివుడికి ఎంతో ఇష్టమైన పరశువుని కూడా పరశురాముడికి ఇచ్చాడు. అందుకే ఆయనను పరశురాముడు అంటారు.
పరశురాముడి గురువైన శివుడి నుంచి సకల విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడి తపస్సుని మెచ్చి శివుడు తన శక్తివంతమైన గొడ్డలిని కానుకగా ఇచ్చాడు.
వినాయకుడితో కయ్యం
తన గురువు అయిన శివుడి కుమారుడితో పరశురాముడు కయ్యానికి కాలుదువ్వాడు. ఒకసారి కైలాసాన్ని వీక్షించేందుకు శివుడిని కలుసుకునేందుకు పరశురాముడు వెళ్ళాడు. అప్పుడు వినాయకుడు అతన్ని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన ఆయుధాన్ని వినాయకుడి మీదకు విసురుతాడు. విషయం గ్రహించిన వినాయకుడు తండ్రి మీద గౌరవంతో పరశురాముడి ఆయుధం తగిలేలా చేసుకుంటాడు. అలా వినాయకుడి దంతం ఒకటి విరిగిపోతుంది.
మాహిష్మతి రాజు సంహారం
పరశురాముడు మాహిష్మతి రాజుని సంహరించాడు. ఓసారి జమదగ్ని దగ్గర ఉన్న గోమాత గురించి మహిష్మతి రాజు కార్తీవీర్యార్జునుడికి తెలుస్తుంది. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంత మంది వచ్చినా అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడని తెలుసుకుంటాడు. దీంతో ఆ గోమాతను ఇవ్వమని కార్తీవీర్యార్జునుడు జమదగ్నిని కోరాడు. కానీ అందుకు మహర్షి అంగీకరించకపోవడంతో కార్తీవీర్యార్జునుడి బలవంతంగా గోమాతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన పరుశురాముడు ఆగ్రహంతో వెళ్లి రాజుని సంహరించి గోమాతను వెనక్కి తీసుకొని వచ్చాడు.
తల్లిని సంహరించిన పరశురాముడు
తండ్రి మాట జవాదాటని వ్యక్తిగా పరశురాముడికి పేరు ఉంది. అందువల్ల ఓనాడు తన తల్లిని సంహరించాల్సి వచ్చింది. జమదగ్ని భార్య రేణుక ఒకనాడు సరస్సు దగ్గరికి వెళ్లి తిరిగి రావడం ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహించిన జమదగ్ని ఆమెని సంహరించమని కొడుకులను ఆదేశిస్తాడు. కానీ కొడుకులు అందుకు నిరాకరించారు. అయితే తండ్రి మాటను శిరసావహించిన పరశురాముడు తల్లి తలను తెగనరికాడు. పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగితే తన తల్లి ప్రాణాలను తిరిగి ప్రసాదించమని కోరుకున్నాడు. అలా తండ్రి మాట జవదాటకుండానే తల్లి ప్రాణాలను నిలబెట్టుకున్న మహోన్నతుడు పరశురాముడు.
టాపిక్