వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తాము. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. మంగళవారం హనుమంతుడు పూజిస్తే కుటుంబంలో సంతోషాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించేటప్పుడు తమలపాకు, సింధూరాన్ని ఉపయోగిస్తే మంచిది. దీని వలన కోరికలన్నీ కూడా తీరిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు.
మంగళవారం నాడు సింధూరంతో పూజ చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంగళవారం నాడు సింధూరంతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సీతమ్మ వారు పాపిటన సింధూరాన్ని ధరించినప్పుడు, సీతమ్మవారిని ఆంజనేయ స్వామి "ఎందుకు పాపిటన సింధూరాన్ని ధరిస్తున్నారు?" అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ "రాముని క్షేమం కోసం, సకల ఐశ్వర్యాలు పొందడం కోసం సింధూరాన్ని ధరిస్తున్నాను" అని చెప్తారు.
అప్పుడు హనుమంతుడు "సీతమ్మ పాపిటన సింధూరాన్ని ధరిస్తే శ్రీరామునికి అంతా మంచి జరుగుతే, ఒళ్లంతా సింధూరాన్ని అలంకరించుకుంటే ఇంకా ఎంత మంచి జరుగుతుందో?" అని ఒళ్లంతా సింధూరాన్ని రాసుకుంటాడు. ఆ సింధూరం రాలిపోకుండా నువ్వుల నూనెతో కలిపి హనుమంతుడు తన ఒంటికి పోసుకుంటాడు.
అందుకనే ఆంజనేయ స్వామిని ఆరాధించేటప్పుడు సింధూరాన్ని కచ్చితంగా సమర్పిస్తారు. మంగళవారం నాడు గంగ సింధూరంలో కాస్త నువ్వుల నూనెను వేసి, ఆంజనేయ స్వామి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ సమర్పిస్తే సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు.
తమలపాకులతో కూడా ఆరాధించవచ్చు. హనుమంతుడిని పూజించేటప్పుడు హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులను సమర్పిస్తే మంచిది. చాలామంది హనుమంతుడిని ఆరాధించేటప్పుడు తమలపాకుల దండను కూడా సమర్పిస్తారు. ఆంజనేయ స్వామి ఉగ్ర స్వరూపుడు. అందుకనే భక్తులు ఉగ్ర స్వరూపం విడిచిపెట్టి శాంత స్వరూపంతో భక్తుల కోరికలు తీరుస్తారని, తమలపాకు దండను సమర్పిస్తారు. సకల అభీష్టాలు కూడా తమలపాకు సమర్పించడం వలన కలుగుతాయి.
ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడమాలను, అరటి పండ్లను సమర్పిస్తే కూడా మంచిది. హనుమంతుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలను పొందవచ్చు. మినుములతో తయారుచేసిన వడమాలను హనుమంతుడికి సమర్పిస్తే శని భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. శని బాధల నుండి కూడా బయటపడవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.