Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఆకాశంలో అద్భుతం.. స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు
Hanuman jayanti 2024: నేడు తెలుగు రాష్ట్రాలు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజున స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు ఏర్పడతాయి.

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు, ర్యాలీలు నిర్వహిస్తారు. హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమిగా ఉంటుంది. అలాగే పూర్వాభాద్ర కూడా ఆయన జన్మనక్షత్రం. అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు ఆది దైవంగా ఉంటారు. ఆంజనేయ జయంతి రోజున ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు వెలుస్తాయి.
హనుమంతుని పుట్టుక
హనుమంతునికి సంబంధిన ప్రతిపర్వం కూడా ఖగోళ విశేషాలతో ముడుపడి ఉంది. వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయస్వామి జన్మించారని పరాశర సంహిత స్పష్టం చేస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం మంగళవారం ఆంజనేయుడు జన్మించాడని వైష్ణవ మతాబ్జ భాస్కరం తెలుపుతుంది. అలాగే చైత్రమాసే సితే పక్షే పౌర్ణమాస్యాం కుజేహని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడని తంత్రశాస్త్రం వివరిస్తుంది.
అపార ప్రజ్ఙావంతులైన మన రుషులు వారికి ఈ సృష్టిలో అణువణువుతోనూ పరిచయం ఉంది. వారు భూగోళంపై నడయాడుతున్నా ఖగోళంలో ఏది ఎప్పుడు, ఎక్కడ పుట్టిందో, ఎలా జరుగుతుందో లెక్కకట్టి చెప్పగల మేథస్సు వారి సొంతం. ఖగోళంలో ఏర్పడే మార్పులను వారు నిర్ణయిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు వేదకాలం నుంచే ఉంది.
రుగ్వేదం ప్రాతర్యావాణా ప్రథమా యజధ్వమ్ అంటోంది. అంటే ఏ రోజు, ఏ నక్షత్రం ఉంటుందో, ఆరోజు ఆ నక్షత్రానికి సంబంధించిన అధి దేవత పూజలందుకుంటారని తెలుపుతుంది. అందులో భాగంగానే హనుమాన్ జయంతి, వినాయక చవితి చేస్తారు. భాద్రపద మాసంలో హస్తానక్షత్రం రోజున వినాయక చవితిని నిర్వహిస్తాం. అందులో భాగంగానే హనుమంతుని జన్మ నక్షత్రం స్వాతి. ఆ నక్షత్రానికి అమోఘమైన శక్తి ఉంది.
అమిత వేగవంతుడైన, బలసంపన్నడైన వాయుదేవునితో అనుసరించి హనుమంతుడు జన్మించాడు. అందువల్లే అజేయ పరాక్రమవంతుడయ్యారు. ఎవ్వరికీ సాధ్యం కాని సముద్రాన్ని సాధించాడు. అలాగే లంకలో అశోకవనాన్ని విచ్ఛిన్నం చేయగలిగాడు. ఈ క్రమంలో బలవంతులైన ఎందరో రాక్షసులను సంహరించాడు. స్వాతి కార్తె సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆంజనేయస్వామి సముద్రాన్ని దాటుతారు. ఆ సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రం కకావికలమవుతుంది.
శుక్ర గ్రహంతో స్వాతి నక్షత్రం కలిసి ఉంటుంది. ఈ రెండూ కలిస్తే సహజంగానే గాలికి వర్షం తోడవుతుంది. ఇలాంటి సమయాల్లోనే వరదలు, తుఫానులు, ఉప్పెనలు వస్తాయి. మేష రాశి అస్తమించే సమయంలో సూర్యాస్తమయంలో సప్తమ లగ్న వేళ తులా రాశి అవుతుంది. అందువల్ల తులా లగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది. స్వాతి నక్షత్రమంటే సాక్షాత్తూ ఆంజనేయస్వామే. ఇదే వైశాఖ బహుళ దశమి సమయంలోనే హనుమంతుడు జన్మించాడు.
స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు ఉండటాన్ని బల్దియా, బాబిలోనియా, ఈజిప్టు దేశాల్లో లభించిన సాక్ష్యాలు స్పష్టం చేస్తాయి. ఆదికవి వాల్మీకి కూడా రామాయణంలో ఈ విషయాన్ని "అనుయాస్యన్తి మామధ్య ప్లవమానం విహాయసా భవిష్యతి హిమే పంథా స్స్వాతే: పంథా ఇవాంబరే" అని పేర్కొన్నారు. అదీకాక స్వయాన హనుమంతుడే తనది స్వాతి నక్షత్రమని చెప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
కవి విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణ కల్పవృక్షంలో "ద్విత్రి విలిప్తలన్ గగన్ వీధి జరింతును నేను స్వాతి నక్షత్రము వోలె" అను ఆంజనేయస్వామి అన్నట్లు రాశారు. ఆంజనేయస్వామి గొప్ప రామ (విష్ణు) భక్తుడని అమరత్వం వరం పొందాడని చెబుతోంది. విష్ణుపదమంటే ఆకాశం అని అర్థం. విష్ణువు ఉన్న చోట కూడా స్వాతి, శ్రవణా నక్షత్రాల మధ్య ఉంటుంది. శ్రవణా నక్షత్రమంటే విష్ణుమూర్తి వాహన రాజమైన గరుత్మంతుడు. అన్నమయ్య కూడా హనుమంతుడిని విష్ణు సేవకుడిగానే కీర్తించాడు.
జగదీశ్వరరావు జరజాపు
హిందుస్థాన్ టైమ్స్ తెలుగు రిపోర్టర్