Sravana masam 2024: మరో పది రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తారు. ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తూ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివుడికి కొన్ని పదార్థాలు సమర్పించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.
శివునికి అత్యంత సాధారణ నైవేద్యాలలో పాలు ఒకటి. పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని చెబుతారు. హిందూ విశ్వాసాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరిస్తాడు. దానివల్ల కలిగిన వేడిని తగ్గించడం కోసం చల్లటి పాలు, నీటితో మహాదేవుడిని అభిషేకిస్తారు. పాలు మండుతున్న గొంతు నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
శ్రావణ మాసంలో శివుడికి సమర్పించే మరొక్క పదార్ధం పెరుగు. అయితే ఆవు పెరుగు మాత్రమే సమర్పించాలి. పాలు మాదిరిగానే పెరుగు కూడా శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది. శివునికి పెరుగు సమర్పించడం వల్ల భక్తుల మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందని వారి ప్రార్థనలు పరమేశ్వరుడికి త్వరగా చేరుతాయని నమ్ముతారు. పెరుగు మంచి ఆరోగ్యానికి చిహ్నం. శివలింగానికి పెరుగు సమర్పించడం వల్ల మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది.
ప్రకృతిలో చాలా స్వచ్ఛమైన ఐదు పదార్థాలతో తయారు చేసేది పంచామృతం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లంతో దీన్ని తయారుచేస్తారు. ఈ పదార్థాలు ప్రతిదానికి సొంత ప్రాముఖ్యత ఉంది. పాలు స్వచ్ఛతకు, ఆరోగ్యానికి పెరుగు, మధుర సంబంధాలకు తేనే, మంచి పోషణకు నెయ్యి, జీవితంలో ఆనందానికి తీపి ప్రతీకగా నిలుస్తాయి. పంచామృతం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. శివునికి పంచామృతం సమర్పించడం వల్ల సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుంది.
తేనె కూడా హిందూమతంలో స్వచ్ఛమైనది, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆత్మను శుద్ధి చేయడం మాత్రమే కాదు శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. శివలింగానికి తేనెను నివేదించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శివుడికి తేనే అందించడం స్వచ్ఛతను సూచిస్తుంది. బంధాలు మధురంగా ఉండాలని కోరుకుంటూ శివుడికి తేనె సమర్పిస్తారు.
నెయ్యి స్వచ్ఛత, పోషణకు చిహ్నంగా ప్రకటిస్తారు. శివలింగానికి నెయ్యి సమర్పించడం వల్ల భక్తుల హృదయాలు శుద్ధి అవుతాయి. వారి ప్రార్థనలు మరింత శక్తివంతంగా మారతాయని నమ్ముతారు. నెయ్యి ఇంట్లో చేసే హవనాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది ప్రతికూల శక్తులను కాల్చివేస్తుంది. సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది.
శివునికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రాలు. విష్ణుమూర్తికి తులసి ఆకులు ఏ విధంగానో శివుడికి బిల్వ పత్రాలు అత్యంత ఇష్టమైనవి. అయితే శివుడిని ప్రార్థించేటప్పుడు పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించకూడదు. ఇవి అశుభమైనవిగా పరగణిస్తారు. అయితే బిల్వపత్రాలు శివుని మూడు కళ్ళకు చిహ్నంగా పిలుస్తారు. అందుకే ఈ పత్రాన్ని సమర్పించి పూజ చేయడం వల్ల శివుడు త్వరగా ప్రసన్నమవుతాడని నమ్ముతారు. భక్తుల హృదయం, ఆత్మను శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. శ్రావణమాసంలో శివలింగానికి 3 నుంచి 11 బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
శివలింగానికి పసుపు, కుంకుమ ఎప్పుడు సమర్పించకూడదు. అందుకు బదులుగా గంధాన్ని రాయాలి. శ్రావణమాసంలో చాలామంది భక్తులు గంధం పేస్ట్ శివలింగానికి రాస్తారు. ఇది విష ప్రభావం నుంచి ఓదార్పు ఇస్తుంది. శాంతింపజేసే లక్షణాలను కలిగి ఉంటుంది. శివలింగానికి గంధం సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని నమ్ముతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.