ఎల్లుండే అట్లతద్ది.. ఈ వ్రత మహత్యంతో పాటు, కుజ దోషం ఉన్నవారు చెయ్యాల్సిన ఆ ఒక్క పనేంటో కూడా తెలుసుకోండి!-october 9th 2025 thursday atlataddi check its vrata mahatyam and also see what to do to get rid of kuja doshas check now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఎల్లుండే అట్లతద్ది.. ఈ వ్రత మహత్యంతో పాటు, కుజ దోషం ఉన్నవారు చెయ్యాల్సిన ఆ ఒక్క పనేంటో కూడా తెలుసుకోండి!

ఎల్లుండే అట్లతద్ది.. ఈ వ్రత మహత్యంతో పాటు, కుజ దోషం ఉన్నవారు చెయ్యాల్సిన ఆ ఒక్క పనేంటో కూడా తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

అట్లతద్ది నాడు పెళ్లి కాని వారు మంచి జీవిత భాగస్వామి రావాలని అట్లతద్ది నోము చేసుకుంటారు. స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును నిష్ఠతో జరుపుతారు. ఈరోజు గౌరీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఈ వ్రత మహత్యంతో పాటు, కుజ దోషం ఉన్నవారు చెయ్యాల్సిన ఆ ఒక్క పనేంటో కూడా తెలుసుకోండి.

అట్లతద్ది 2025 (pinterest)

అట్లతద్ది పండుగను ఆడపడుచులు, పెళ్లయిన స్త్రీలు ఉపవాసం ఉండి అట్లతద్ది నోము చేసుకుంటారు. సాయంత్రం అట్లను ముత్తయిదువుకి ఇచ్చి, చంద్రుని చూసి, అప్పుడు ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ ఏడాది అట్లతద్ది అక్టోబర్‌ 9, గురువారం నాడు వచ్చింది. స్త్రీలు చేసే నోముల్లో అట్లతద్ది నోము కూడా ఒకటి.

అట్లతద్ది పండుగ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది అట్లు. 11 అట్లు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వాయినం ఇస్తారు. అదే విధంగా 11 అట్లు, బెల్లం ముక్క నోము చేసుకున్న వారు చంద్రుని దర్శనం అయిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్లతద్దినాడు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలలూగడం కూడా ఆనవాయితీ.

జీవిత భాగస్వామి కోసం

దక్షిణాది రాష్ట్రాలలో అట్లతద్ది పండుగ జరుపుకుంటే, ఉత్తరాది రాష్ట్రాలలో కర్వా చౌత్‌గా జరుపుకుంటారు. అట్లతద్ది నాడు పెళ్లి కాని వారు మంచి జీవిత భాగస్వామి రావాలని అట్లతద్ది నోము చేసుకుంటారు. పెళ్లి అయిన స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును నిష్ఠతో జరుపుతారు. ఈరోజు గౌరీదేవిని, చంద్రుడిని ముఖ్యంగా పూజిస్తారు. గౌరీదేవి కూడా శివుడిని భర్తగా పొందడానికి నోము చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అట్లతద్ది నాడు కుజ దోషం నుంచి ఎలా బయటపడొచ్చు?

అట్లతద్ది నాడు కుజ దోషము ఉన్న వారు ఈ వ్రతం ఆచరిస్తే కుజ దోషం తొలగిపోతుంది. ఎందుకు కుజ దోషం తొలగిపోతుంది అనే విషయానికి వస్తే.. అట్లతద్ది నాడు నైవేద్యంగా పెట్టే అట్లు అంటే కుజుడికి ఎంతో ఇష్టం. కనుక ఈ రోజు ఈ నోము చేసుకుంటే కుజుని అనుగ్రహం కలిగి, వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.

కుజ దోషం ఏమైనా ఉంటే కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. గర్భదోషాలు, గర్భస్రావం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయట. అందుకే అట్లతద్దినాడు అట్లను నైవేద్యంగా పెడతారు, వాయనంగా ఇస్తారు. అట్లు వేయడానికి వాడే మినుములు, బియ్యం గ్రహాలకు సంబంధించినవి. మినుములు రాహువుకి చెందినవి, బియ్యం చంద్రుడికి సంబంధించినది.

అట్లతద్ది పూజ విధానం

ఇంటి తూర్పు దిక్కున మండపం పెట్టి గౌరీ దేవిని ఆరాధించాలి. ధూప, దీప నైవేద్యాలని సమర్పించాలి. వినాయకుడిని పూజించాలి.

గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదువుకోవాలి.

సాయంత్రం చంద్ర దర్శనం అయిన తర్వాత గౌరీదేవిని ఆరాధించి ముత్తైదువులకి పండ్లు, అట్లు వాయినంగా ఇవ్వాలి.

అట్లతద్ది నోము కథ చదువుకొని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.