అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, ఈ వస్తువులు కొన్నా కూడా శుభకరమే, ఇక కొనకూడనివి ఇవిగో-not only gold but also these items are auspicious to buy on akshaya tritiya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, ఈ వస్తువులు కొన్నా కూడా శుభకరమే, ఇక కొనకూడనివి ఇవిగో

అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, ఈ వస్తువులు కొన్నా కూడా శుభకరమే, ఇక కొనకూడనివి ఇవిగో

Haritha Chappa HT Telugu

అక్షయ తృతీయ వచ్చిందంటే అందరూ బంగారమే కొనాలని అనుకుంటారు. నిజానికి బంగారమే కాదు ఇతర కొన్ని వస్తువులు కొనడం ద్వారా కూడా సంపదను అభివృద్ధి చేసుకోవచ్చు. అక్షయ తృతీయనాడు ఏ వస్తువులు కొనవచ్చో, ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకోండి.

అక్షయ తృతీయకు ఏం కొనాలి?

అక్షయ తృతీయ వస్తే బంగారం షాపులు కిటకిటలాడుతాయి. ఆరోజు బంగారం కొంటే సంపద రెట్టింపు అవుతుందని ఎంతోమంది నమ్మకం. అక్షయ తృతీయ ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన దినాలలో ఒకటి. ఆ రోజు కొన్న వస్తువులు విలువ ఎప్పటికీ తగ్గదని నమ్ముతారు. అక్షయ అంటే ఎప్పటికీ చెడిపోని వస్తువు అని అర్థం. అందుకే అక్షయ తృతీయనాడు బంగారాన్ని ఎక్కువమంది కొంటారు. అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు ఇతర వస్తువులు కూడా కొనవచ్చు. అవి కూడా ఇంట్లో సంపదను రెట్టింపు చేస్తాయి.

అక్షయ తృతీయ రోజు విష్ణువు, లక్ష్మీదేవికి పూజలు చేసి ఆస్తులు కొనేందుకు, బంగారం కొనేందుకు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. ఆరోజు బంగారం, వెండి ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడు... శివుడు, బ్రహ్మదేవుడు ఆశీస్సులతో స్వర్గ సంపదకు అధిపతిగా మారాడని నమ్ముతారు.

అక్షయ తృతీయనాడు కొనవలసిన వస్తువులు

అందరికీ తెలిసినట్టు బంగారం అక్షయ తృతీయ రోజు కొనడం ఎంతో మంచిది. ఇది విలువైన లోహం మంచి పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుంది. అక్షయ తృతీయ రోజున కొన్న బంగారం విలువ పెరుగుతుందని ఎంతోమంది నమ్ముతారు.

కొత్త ఇల్లు

అక్షయ తృతీయనాడు కొత్త ఇల్లు కొంటే విష్ణువు, లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కొన్న వస్తువుకు ఎటువంటి దురదృష్టం తాకదని, అది ఇంటిల్లిపాదికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు.

కొత్త వాహనం

కొత్త వాహనం కొనాలన్న ప్లాన్ మీకు ఉంటే అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం చూసి అప్పుడు కొత్త వాహనాన్ని కొనండి. ఇది ఎంతో మంచి పద్ధతి. ఆ రోజు కొన్న వాహనం కూడా మీకు అన్ని విధాలుగా కలిసివస్తుంది.

వెండి నాణెం

వెండి నాణాన్ని కూడా లక్ష్మీదేవి చిహ్నంగా నమ్ముతారు. వెండి నాణెం పై లక్ష్మీదేవి రూపు ఉంటే ఇంకా మంచిది. అలాగే ఆ వెండి నాణాన్ని లాకర్లో భద్రంగా ఉంచడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది.

మట్టి కుండ

మట్టి కుండ కొనడానికి 100 రూపాయలు ఉన్నా చాలు. మట్టి కుండ కూడా అక్షయ తృతీయ రోజు కొనడం వల్ల ఎంతో సంపదను అందిస్తుంది. మట్టికుండ డబ్బును, సంపదను సూచిస్తుంది. ఆరోజు మట్టికుండను పూజించి బియ్యము, పసుపు వేసి ఆ కుండను నింపాలి. దాన్ని అలా వచ్చే ఏడాది వరకు ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. మట్టికుండను అన్ని తరగతుల వారు కొనవచ్చు. కాబట్టి బంగారం కొనలేకపోతే ఇలా మట్టికుండను కూడా కొంటే ఎంతో మంచిది.

దుస్తులు

కొత్త బట్టలు అక్షయ తృతీయనాడు కొనడం శుభకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఇంటికి అదృష్టాన్ని, శ్రేయస్సుని తెస్తుందని నమ్ముతారు.

పుస్తకాలు

పుస్తకాలు కొనడం అంటే సరస్వతి దేవితో సమానం. అక్షయ తృతీయనాడు కొత్త పుస్తకాలు కొనడం వల్ల వ్యక్తిగత వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. విద్యకు దేవత అయిన సరస్వతీదేవి ఆశీర్వాదాలు కూడా పొందుతారని చెబుతారు.

పాత్రలు

అక్షయ తృతీయనాడు రాగితో చేసిన పాత్రలు, ఇత్తడి పాత్రలు కొనడం కూడా ఎంతో మంచిది. ఇది శుభప్రదం కూడా.

అక్షయ తృతీయ రోజు కొనకూడని వస్తువులు

అక్షయ తృతీయ రోజున పదునైన వస్తువులు ఏవీ కొనకూడదు. అంటే కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనడం ఏమాత్రం శుభప్రదం కాదు. అలాగే ప్లాస్టిక్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు కూడా కొనడం మంచి పద్ధతి కాదు. కొంతమంది స్టీల్ పాత్రలు కూడా కొనకూడదని చెబుతారు.

అక్షయ తృతీయ రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు చీకటిగా లేదా మురికిగా ఉండకూడదు. ఆ రోజు కచ్చితంగా లక్ష్మీదేవి ముందు దీపం, అగరబత్తులు వెలిగించండి. అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని లేదా లక్ష్మీ మంత్రాన్ని పఠించండి. ఆరోజు దానధర్మాలు చేయండి. అలాగే పండ్లు, రసాలు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.

(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం