Navaratri 3rd day: మూడో రోజు అన్నపూర్ణా దేవి అలంకారం- విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం ఇదే
Navaratri 3rd day: శరన్నవరాత్రులలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణా దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారి విశిష్టత, ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం, ధరించాల్సిన రంగు గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మ వారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అలరారుతారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు .
'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!' అని ప్రార్ధిస్తూ ఈ రోజున ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవి గా అలంకరించి, ఆరాధించాలని చిలకమర్తి తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ పరమాత్మే ఆది భిక్షువుగా బిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాం.
ఎవరికైనా కడుపునిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాల సంతోషంతో ఆకలిగా ఉన్ననాకు అన్నపూర్ణా దేవిగా అన్నం పెట్టావు తల్లీ అని అనటం వింటూ ఉంటాం. ఆ మాట అక్షరాలా నిజం కూడా. భోజనం పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే. ఇంటికి వచ్చిన అతిథులకు కానీయండి, ఇంటిలోని వారికే కానీయండి, ఎవరికైనా అన్నం వడ్డన చేసేటపుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళలోని ఆప్యాయతే అన్నపూర్ణతత్వాన్ని తెలియచేస్తుంది. భోజనం చేసిన వారి కళ్ళలోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ అని చిలకమర్తి తెలిపారు.
జీవకోటికి ప్రాణాధారం అయిన అన్నం అన్నపూర్ణాదేవి అధీనం. పరమేశ్వరునికే బిక్ష వేసి ఆది భిక్షువుని చేసింది కనుక మనమందరం ఈ రోజున వామ హస్తమున అక్షయమైన అన్న పాత్ర, దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనో నేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణా అష్టోత్తరనామాలతో అమ్మవారిని పూజించుకుని, పునీతులమవుదామని చిలకమర్తి తెలిపారు.
ఈ రోజునే తల్లులందరూ 'స్తనవృద్ధి గౌరీ వ్రతం' అని కూడా జరుపుకుంటారు. తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణా దేవిగా కొలుస్తారని చిలకమర్తి తెలిపారు. మనమందరమూ కూడా దేవీ నవరాత్రులలో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి, ఆమెను ప్రసన్నం చేసుకుని తరిద్దాము. అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ, అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ, సమస్త ఉపచారాలు చేసి, దద్ధోజనాన్ని, కట్టె పొంగలిని నివేదిద్దామని చిలకమర్తి తెలిపారు. ఈరోజు ధరించాల్సి రంగు గంధం అని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.