Navaratri 9th day: మహా నవమి నాడు మహిషాసురమర్ధిని అలంకారం- అమ్మవారి విశిష్టత, పూజా విధానం ఇదే-navaratri 9th day maha navami mahishasura mardini avataram significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri 9th Day: మహా నవమి నాడు మహిషాసురమర్ధిని అలంకారం- అమ్మవారి విశిష్టత, పూజా విధానం ఇదే

Navaratri 9th day: మహా నవమి నాడు మహిషాసురమర్ధిని అలంకారం- అమ్మవారి విశిష్టత, పూజా విధానం ఇదే

HT Telugu Desk HT Telugu

Navaratri 9th day: శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. నవరాత్రులలో తొమ్మిదో రోజు అంటే అక్టోబర్ 11న అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ అలంకారం విశిష్టత, పూజా విధానం గురించి ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

మహా నవమి రోజు మహిషాసురమర్దిని అవతారం

ఈ ఏడాది శరన్నవరాత్రులలో అష్టమి, నవమి తిథులు రెండూ ఒకే రోజు వచ్చాయి. అందువల్ల చాలా విశేషమైన రోజుగా అక్టోబర్ 11 నిలిచిపోనుంది. శరన్నవరాత్రులలో నవమి రోజు 'మహానవమి'గా ప్రాశస్త్యం పొందిందని ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసురమర్ధినీ అవతారం అని చిల‌క‌మ‌ర్తి చెప్పారు. అమ్మవారు ఉగ్రరూపంతో చేతిలో త్రిశూలంతో సింహ వాహినియై దుష్టశిక్షణ గావిస్తూ ఉంటుంది. మనం మొదట్లో చెప్పుకున్న విధంగా మహిషాసురుడనే రక్కసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది ఇంద్రుడిని ఓడించి దేవతలకు కూడా హాని తలపెట్టడంతో అందరూ పరుగు పరుగున శివకేశవుల దగ్గరకు వెళ్లి రక్షించమని వెదుకున్నారు. సమస్తదేవతల నుండి శక్తి వెలువడి ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి దుష్టశక్తిని అణచదలచింది.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆ రోజు నవమి దాకా పోరు సలిపి ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రక్కసుని అంతమొందించి దుష్ట శిక్ష‌ణ, శిష్ట ర‌క్ష‌ణ గావించింది. అందుచేతనే ఈ నవమిని మహానవమిగా భక్తులు జరుపుకుంటారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. త్రిరాత్ర వ్రతం ఈరోజుతో ముగుస్తుంది. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పరమేశ్వరిని మహిషాసురమర్ధిని అవతారంలో అనేక విధాలుగా పూజించి జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యక పర్ధని శైలసుతే...! అంటూ ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహార, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి, శాంతింపచేస్తారు.

మనం కూడా శైలపుత్రిని ఈ రోజు మహిషాసురమర్ధినిగా మన మనస్సులలో నిలుపుకుని మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మ వారి కరుణాకటాక్షాలు పొందుదాం అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఈరోజు ధ‌రించాల్సిన రంగు బ్రౌన్ కలర్. అలాగే నైవేద్యం మిన‌ప గారెలు అని ఆధ్యాత్మికవేత్త చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ